భారతీయుల ఫేవరెట్ టిఫిన్ ఏదో తెలుసా?

6 Jun, 2017 12:33 IST|Sakshi
భారతీయుల ఫేవరెట్ టిఫిన్ ఏదో తెలుసా?

హోటల్‌కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇవ్వాలంటే ఏం చెబుతారు? ఒకప్పుడంటే ఏమో గానీ ఇప్పుడు మాత్రం ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా కూడా లేకుండా చాలామంది 'దోశ' కావాలనే చెబుతున్నారట. ప్లెయిన్ దోశ, ఆనియన్, మసాలా, రవ్వ, ఉల్లి రవ్వ, పెసర.. ఇలా రకరకాల దోశలు నోరు ఊరిస్తుంటే ఎవరు మాత్రం ఊరుకోగలరు? కొబ్బరి చెట్నీ, అల్లం చెట్నీ, సాంబారు ఇలాంటివి నంజుకుని తెగ లాగిస్తున్నారట. దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్ల మీద ఆన్‌లైన్ సర్వే చేస్తే ఈ విషయం తెలిసింది. ఒకవేళ దోశ లేదనుకుంటే మాత్రం అప్పుడు పోహా, పరోటాలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కువగా దోశలవైపే వినియోగదారుల మనసు మొగ్గు చూపుతోంది.

స్విగ్గీ అనే ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఈ సర్వే చేసింది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ముందు దోశలవైపే జనం వెళ్తున్నారు. ఢిల్లీ జనాలు మాత్రం దాంతోపాటు చోళే భతూరే ఆర్డర్ ఇస్తుంటే.. ముంబై వాళ్లు బన్ మస్కా చెబుతున్నారు. పుణె వాసులు సాబుదానా కిచిడీ కావాలన్నారు. బెంగళూరులో ఎక్కువ మంది మసాలాదోశ, ఇడ్లీ వడ, పోహా అడుగుతున్నారు. దోశలలో తగినంతగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయని.. అందువల్ల అది ఆరోగ్యరీత్యా కూడా మంచిదని ఇండియన్ డయెటిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు షీలా కృష్ణస్వామి చెప్పారు. వారాంతాలలో అయితే దోశ ఆర్డర్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. మామూలు రోజుల్లో కంటే వారాంతాల్లో అయితే 30 శాతం ఎక్కువమంది వినియోగదారులు రకరకాల దోశలు కావాలని అడుగుతున్నారు. మామూలు రోజుల్లో చూసుకుంటే సోమ, మంగళవారాల్లో ఎక్కువమంది బయట టిఫిన్లు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఇళ్లలోనే చేసుకుంటున్నారట.

మరిన్ని వార్తలు