డిజిటల్‌ చెల్లింపులంటే భయం

21 Jun, 2019 19:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో ‘పెద్ద నోట్ల’ను రద్దు చేసినప్పటికీ డిజిటల్‌ చెల్లింపులు పెరక్క పోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇందులో వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్‌లో 1,003 మంది వ్యాపారులను సంప్రతించింది. వారిలో 97 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. 79 శాతం మందికి ఇంటర్నెట్‌ సౌకర్యం తీసుకునే సదుపాయం కలిగిన డివైస్‌లు ఉన్నాయి. 54 శాతం మందికి ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా ఉంది. 96 శాతం మందికి డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన జ్ఞానం ఉంది. వారిలో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా వ్యాపారాన్ని నిర్వహించేందుకు 98.6 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.

డిజిటల్‌ చెల్లింపులకు పడే ఆర్థిక భారాన్ని భరించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అయినా వారిలో కేవలం 42 శాతం మంది మాత్రమే డిజిటల్‌ చెల్లింపుల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇక వారి దగ్గరికి వస్తున్న వినియోగదారుల్లో 80 శాతం మంది నగదు రూపంలోనే చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు కారణం ఏమిటని వ్యాపారలను ప్రశ్నించగా, ఒకటి. డిజిటల్‌ చెల్లింపుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడం. రెండు. మధ్యలో ఎవరైన తమ డబ్బులను తస్కరిస్తారన్న భయం. మూడు ప్రభుత్వానికి ఎక్కడ పన్ను చెల్లించాల్సి వస్తుందేమోనన్న భయం అని వారు వివరించారు. 
 

మరిన్ని వార్తలు