కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ

11 Jul, 2019 03:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) సాఫ్ట్‌వేర్, డెస్క్‌టాప్‌ పీవోఎస్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్‌ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్‌ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. 

మరిన్ని వార్తలు