వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం 

8 Jul, 2020 01:37 IST|Sakshi
జూన్‌ 28 వరకు ఇక్కడచైనా సైనిక శిబిరాలు ఉండేవి. ప్రస్తుతం ఇలా ఖాళీగా కనిపించాయి.

గల్వాన్‌ లోయలో కొనసాగుతున్న ఉపసంహరణ 

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలోని భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ముగిసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్మీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 హాట్‌స్ప్రింగ్స్‌ వద్ద ఉపసంహరణ ప్రక్రియ మంగళవారమే పూర్తి కావచ్చని, గొగ్రా ప్రాంతంలో మాత్రం మరి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపాయి. ఇరుదేశాల ఆర్మీ కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చలు, ఆ తరువాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యిల మధ్య ఆదివారం జరిగిన చర్చల నేపథ్యంలో.. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా, బలగాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఉపసంహరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పలు ప్రదేశాల్లో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను సోమవారం నుంచి చైనా తొలగించడం ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రెండు దేశాల సైన్యాలు ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్లాలి. అలాగే, భవిష్యత్‌ కార్యాచరణ కోసం చర్చలు కొనసాగించాలి’ అని వెల్లడించాయి. చైనా ఉపసంహరణ ప్రక్రియను భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోందన్నాయి. బలగాలు వెనక్కు వెళ్తున్నప్పటికీ.. భారత సైన్యం అప్రమత్తంగానే ఉందని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందని తెలిపాయి.

గల్వాన్‌ లోయలోని పీపీ 14 నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని, టెంట్స్‌ను తొలగించాయని తెలిపాయి. పాంగాంగ్‌ సొ ప్రాంతంలో మాత్రం చైనా బలగాల సంఖ్య స్వల్పంగా తగ్గడాన్ని గమనించామని పేర్కొన్నాయి. ఘర్షణ జరిగిన, జరిగే అవకాశమున్న ప్రాంతాల వద్ద మూడు కిలోమీటర్ల వరకు ‘బఫర్‌జోన్‌’ను ఏర్పాటు చేయాలని జూన్‌ 30న ఇరుదేశాల కమాండర్‌ స్థాయి చర్చల్లో నిర్ణయించారు. ఈ చర్చల సందర్భంగా.. క్షేత్రస్థాయి సైనికుల సంఖ్యలో తగ్గింపు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, మొత్తంగా ఉద్రిక్తతల సడలింపులో గణనీయ పురోగతి సాధించినట్లు చైనా తెలిపింది.

లద్దాఖ్‌లో వాయుసేన రాత్రి గస్తీ
తూర్పు లద్దాఖ్‌ పర్వతాలపై సోమవారం రాత్రి భారత వైమానిక దళ విమానాలు గస్తీ నిర్వహించాయి. ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాల మధ్య ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ.. వైమానిక దళ సన్నద్ధతను, అప్రమత్తతను కొనసాగించాలని అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ పెట్రోలింగ్‌ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   పాంగాంగ్‌ సొ, గొగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌ సహా అన్ని వివాదాస్పద ప్రదేశాల్లో  య«థాతథ స్థితి నెలకొనే వరకు చైనాపై ఒత్తిడి తెవాలన్న వ్యూహంలో భాగంగా, రాత్రి, పగలు యుద్ధ విమానాల గస్తీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ‘ఈ పరిస్థితుల్లో మన సన్నద్ధతపై రాజీ ఉండకూడదు’ అని వ్యాఖ్యానించాయి. కొన్ని రోజులుగా భారత్‌ ఫైటర్‌ జెట్స్‌ను, ఎటాక్‌ చాపర్లను, రవాణా విమానాలను లద్దాఖ్‌లో మోహరిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు