పఠాన్‌కోట్‌లో ఆపరేషన్‌ కొనసాగుతూనే..!

3 Jan, 2016 19:57 IST|Sakshi
పఠాన్‌కోట్‌లో ఆపరేషన్‌ కొనసాగుతూనే..!

పఠాన్‌కోట్‌/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో నక్కిన ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతున్నదని, ఇప్పటికే సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను జవాన్ల నుంచి వేరుచేసిన బలగాలు.. వారిని ఏరివేసేందుకు  ప్రయత్నిస్తున్నాయని కేంద్రంలోని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే ఇప్పటివరకు ఎయిర్‌బేస్‌లో ఎంతమంది ఉగ్రవాదులను  ఏరివేశారు, ఇంకా ఎంతమంది నక్కి ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులతో కమాండోల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మహర్షి ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది అధికారికంగా సరైన సమాచారం అందకపోవడం సందిగ్ధతకు దారితీస్తోంది.

ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌బేస్‌పై  దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు శనివారం హతమయ్యారని ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపింది.

ఎయిర్‌బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడటంతో మళ్లీ కలకలం రేగింది. శనివారం ఉదయం పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని దీటుగా తిప్పికొట్టిన బలగాలు నలుగురిని హతమార్చాయి. అయినా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ శనివారంతో ముగియలేదు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్నట్టు తేలడం.. ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో బలగాలు మరో ఆపరేషన్‌ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదో ఉగ్రవాది మధాహ్నం హతమవ్వగా.. మరికొంత ప్రతిఘటన అనంతరం ఆరో ఉగ్రవాది కూడా మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.


కాగా, ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం గ్రనేడ్ పేలిన ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తీసుకొచ్చిన గ్రనేడ్ నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది.

మరిన్ని వార్తలు