శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘వై ఫై’ట్..!

4 Jul, 2014 23:09 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలో వై ఫై సేవల ప్రారంభంపై శివసేన, మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మహానగర పాలక సంస్థ(బీఎంసీ) తరఫున శివాజీ పార్క్ మైదానం పరిసరాల్లో వై ఫై సేవలు ప్రారంభిస్తామని గత ఏడాది మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు. కాని ఆ సేవలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో వై ఫై సేవలను తాము ప్రారంభించనున్నట్లు ఎమ్మెన్నెస్ ప్రకటించింది.ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించింది.

 దీంతో తేరుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ తాము నగరంలో వై ఫై సేవల కల్పనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఎమ్మెన్నెస్ నేత రాజ్ ఠాక్రే కొట్టిపారేశారు. నగరవాసులకు వై ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని శివసేన చెప్పి ఏడాది దాటినా ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని అందుకే తాము ముందుకు వచ్చామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నట్లు బీఎంసీలోని ఎమ్మెన్నెస్ గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే స్పష్టం చేశారు. దీనిపై సునీల్ ప్రభు మాట్లాడుతూ బీఎంసీ అనుమతి లేకుండా వై ఫై యంత్ర సామగ్రి ఏర్పాటు చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై సందీప్ దేశ్‌పాండేది తొందరపాటు చర్య అని ఆరోపించారు. బీఎంసీ తరఫున త్వరలోనే వై ఫై సేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు