కరోనాపై పోరు: ప్రధాని మోదీ వీడియో సందేశం

3 Apr, 2020 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌కు దేశ ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలిపిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. దేశమంతా కరోనాకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేస్తోందని, ఇది చారిత్రాత్మకమైందని కొనియాడారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని శుక్రవారం ఉదయం ఆయన వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సందేశం ఆయన మాటల్లోనే..
(చదవండి: దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత)

నా ప్రియమైన సోదర పౌరులారా!
ప్రపంచ మహమ్మరి కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించి ఇవాళ్టికి 9 రోజులు గడిచాయి. ఈ తొమ్మిది రోజులలో మీరు ప్రదర్శించిన క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి అపూర్వమైనవేగాక రెండింటి వాస్తవ సమ్మేళన స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రభుత్వం, పాలన యంత్రాంగంతోపాటు ముఖ్యంగా ప్రజానీకం విశేష సంయుక్త కృషితో పరిస్థితిని చక్కదిద్దడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో అహర్నిశలూ శక్తియుక్తులను ధారబోస్తున్నవారికి మార్చి 22, ఆదివారం నాడు మీరంతా కృతజ్ఞత చూపిన విధానమే నేడు అన్ని దేశాలకూ ఆదర్శప్రాయమైంది. ఆ మేరకు అనేక దేశాలు మనల్ని అనుసరిస్తున్నాయి.

జనతా కర్ఫ్యూ.. గంట కొట్టడం.. చప్పట్లు చరచడం.. పళ్లాలు మోగించడం... వంటిది ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఈ పరీక్షా సమయంలో జాతి సమష్టి శక్తిని నలుదిక్కులకూ చాటాయి. కరోనాపై యుద్ధంలో దేశం మొత్తం ఏకం కాగలదన్న విశ్వాసాన్ని మరింత లోతుగా పాదుకొల్పడానికి బాటలు వేసింది ఇదే. మీతోపాటు దేశవాసులంతా ప్రదర్శిస్తున్న ఈ సమష్టి స్ఫూర్తి ప్రస్తుత దిగ్బంధ సమయంలోనూ ప్రస్ఫుటమవుతోంది.

మిత్రులారా!
దేశంలోని కోట్లాది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమైన ఈ సమయంలో- తామొక్కరమే ఏం చేయగలమన్న ప్రశ్న తలెత్తడం సహజం. అంతేకాదు.. ఒంటరిగా ఇంతటి మహా యుద్ధం చేయడం ఎలాగని కూడా కొందరు మదనపడుతుండొచ్చు. ఈ విధంగా ఇంకా ఎన్ని రోజులు కాలం గడపాలన్న ఆందోళన అనేకమందిలో ఉండొచ్చు...

మిత్రులారా!
ఇది కచ్చితంగా దిగ్బంధ సమయమే.. మనమంతా తప్పనిసరిగా ఇళ్లకు పరిమితం కావాల్సిందే.. కానీ, మనమెవరూ ఒం‍టరివాళ్లం కాదు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయుల సమష్టి శక్తి మనకు తోడుగా ఉంది. అది మనలో ప్రతి ఒక్కరి బలానికి ప్రతిరూపమే. ఈ సామూహిక శక్తి గొప్పతనం, ఘనత, దివ్యత్వాలను ఎప్పటికప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవడం దేశవాసులందరికి అవసరం.

మిత్రులారా!
మన దేశంలో ‘అహం బ్రహ్మస్మి’ అనే భావన అనాదిగా ఉన్నదే. అందువల్ల దేశం ఇంత భారీ యుద్ధం చేస్తున్నవేళ, ఎప్పటికప్పుడు ఈ అద్భుత సమైక్య శక్తి ప్రజల రూపంలో ప్రస్ఫుటం అవుతున్నదిగా అనుభూతి చెందాలి. ఈ భావనే మనలో ఆత్మస్థైరాన్ని ప్రోదిచేస్తుంది... మనకు మరింత స్పష్టతనిస్తూ ఒక ఉమ్మడి శక్తితో సామూహిక లక్ష్యంవైపు దిశానిర్దేశం చేస్తుంది.

మిత్రులారా!
కరోనా మహమ్మారి వ్యాప్తి సృష్టించిన అంధకారం నుంచి కాంతివైపు ఆశాభావంతో మనమంతా నిరంతరం ముందుకు సాగాలి. ముఖ్యంగా దీనివల్ల తీవ్ర బాధితులైనవారిని, పేద సోదరీసోదరులను నిరాశానిస్పృహల నుంచి బయటకు తేవాలి. ఈ సంక్షోభంతో అలముకున్న చీకటిని, అనిశ్చితిని తుత్తునియలు చేస్తూ ప్రకాశంవైపు, సుస్థిరత దిశగా సాగుతూ ఈ అంధకారాన్ని ఛేదించి తీరాలి. అద్భుతమైన ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపజేస్తూ ఈ సంక్షోభంవల్ల చుట్టుముట్టిన చీకటిని మనం చిత్తుగా ఓడించాల్సిందే!

అందుకే... ఈ ఆదివారం అంటే ఏప్రిల్‌ 5 వ తేదీన కరోనా వైరస్‌ సంక్షోభం సృష్టించిన అంధకారాన్ని సామూహికంగా సవాల్‌ చేస్తూ మనమంతా వెలుగుకుగల శక్తిని ప్రజ్వలింపచేద్దాం. ఆ మేరకు ఈ ఏప్రిల్‌ 5న 130 కోట్లమంది భారతీయుల అమేయశక్తిని మనం మేల్కొలుపాలి. మనమంతా 130 కోట్ల మంది భారతీయుల అమేయ సంకల్పాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఈ దిశగా ఏప్రిల్‌ 5న, ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుంచీ మీ అందరి సమయంలో 9 నిమిషాలను నాకివ్వండి. జాగ్రత్తగా వినండి.. ఏప్రిల్‌ 5వ తేదీ.. ఆదివారం.. రాత్రి 9 గంటలకు.. మీ ఇళ్లలో ప్రవేశద్వారాలవద్ద, బాల్కనీలలో వెలిగించిన కొవ్వొత్తులు లేదా దీపపు ప్రమిదలతో టార్చీలు లేదా మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లను చేతబట్టి 9 నిమిషాలపాటు నిలబడండి. 

ఆ సమయంలో మీ ఇళ్లలోని అన్ని విద్యుద్దీపాలనూ ఆర్పివేయండి. అలా మనం అన్నివైపుల నుంచీ ఒక్కొక్క దీపంతో నిలబడినపుడు ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో ఆ దిశగా వెలుగుకుగల అద్భుత శక్తిని మనం అనుభూతి చెందగలం. ఆ వెలుగులో.. ఆ మెరుపులో.. ఆ ప్రకాశంలో... మనం ఒంటరులం కాదని, మనలో ఎవరూ ఒంటరిగా లేరని, 130 కోట్లమంది భారతీయులమైన మనమంతా ఓ సామూహిక లక్ష్యసాధనకు కట్టుబడి ఉన్నామని దృఢంగా సంకల్పం చెప్పుకుందాం!

మిత్రులారా!
ఈ సందర్భంగా మరొక మనవి... వెలుగును ప్రసరింపజేసే ఈ కార్యక్రమంలో అందరూ ఒక్కటిగా ఉండటం లేదా ఒకచోట గుమికూడటం తగదు. దయచేసి రోడ్లమీదకు, మీ వీధులు, నివాస ప్రాంతాల్లోకి వెళ్లకండి. మీరు నివసించే ఇళ్లలో ద్వారాలు లేదా బాల్కనీలలో మాత్రమే నిలబడండి. సామాజిక దూరం అనే ‘లక్ష్మణ రేఖ’ను ఎట్టి పరిస్థితిలోనూ.. ఏ ఒక్కరూ అతిక్రమించరాదు. ఏ పరిస్థితిలోనూ సామాజిక దూరం నిబంధనకు భంగం వాటిల్లకూడదు. కరోనా వైరస్‌ గొలుసుకట్టు సంక్రమణను విచ్ఛిన్నం చేయగల పాశుపతాస్త్రం ఇదే.

కాబట్టి ఏప్రిల్‌ 5వ తేదీన... రాత్రి 9 గంటలకు... కాసేపు ఏకాంతంగా కూర్చుని భరతమాతను స్మరించుకోండి... 130 కోట్లమంది భారతీయుల వదనాలను మదిలో చిత్రించుకోండి... అలాగే మన అద్భుత సామూహిక శక్తిని, ఉమ్మడి సంకల్పాన్ని అనుభూతి చెందండి. ఈ సంక్షోభ సమయాన్ని అధిగమించగల బలాన్ని, విశ్వాసాన్ని మనకిచ్చేది ఇదే!
మన ఇతిహాసాలు ప్రబోధిస్తున్నట్లు...

“ఉత్సాహో బల్వాన్‌ ఆర్య
న అస్తి ఉత్సాహ్‌ పరం బలం!
సహ్‌ ఉత్సాహస్య లోకేషు,
న కించిత్‌ అపి దుర్లభం!”

అంటే.. “మన సంకల్పం, ఆత్మశక్తిని మించిన గొప్ప శక్తి లోకంలో మరేదీ లేదు. ఈ శక్తి తోడ్పాటు ఉన్నందువల్ల ప్రపంచంలో మనకు సాధ్యంకానిదేదీ లేదు.” అందుకే... రండి- మనమంతా సమష్టిగా ఈ కరోనా వైరస్‌ను పారదోలి, భరతమాతను విజయపథంలో నిలుపుదాం! మీకందరికీ ధన్యవాదాలు!
(చదవండి: ‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం)

మరిన్ని వార్తలు