-

ఆర్మీ కొత్త చీఫ్‌ నియామకంపై రగడ

19 Dec, 2016 01:12 IST|Sakshi
ఆర్మీ కొత్త చీఫ్‌ నియామకంపై రగడ

సీనియర్లను పక్కనపెట్టి రావత్‌కు పట్టమా?: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించడంపై వివాదం రేగింది. రావత్‌ కంటే ఇద్దరు సీనియర్‌ అధికారులు ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి ఆయనను నియమించడాన్ని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుబట్టాయి. ప్రతి సంస్థకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయని, సీనియారిటీని గౌరవించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ తివారి అన్నారు. రావత్‌ సామర్థ్యాన్ని తాము ప్రశ్నించడం లేదని.. సీనియర్లను పక్కనబెట్టి లైనులో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తిని కొత్త ఆర్మీ చీఫ్‌గా తీసుకోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. సీపీఐ నేత డి.రాజా స్పందిస్తూ ఆర్మీలో నియామకం, సీవీసీ, చీఫ్‌ జస్టిస్‌ తదితర ఉన్నతస్థాయి నియామకాలన్నీ వివాదాస్పదంగా మారుతుండటం దురదృష్టకరమని అన్నారు. సైన్యమంటే దేశానికంతటికీ చెందినదని.. అలాంటప్పుడు ఆయా నియామకాలు ఎలా జరిగిందీ దేశానికి చెప్పాల్సిన అవసరం, నియామకంపై ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

సమర్థించుకున్న బీజేపీ.. రావత్‌ నియామకాన్ని బీజేపీ సమర్థించుకుంది. సైనిక వ్యవహారాల్లో అనుభవం, కార్యదక్షతను చూసి ఆయనను నియమించినట్లు పేర్కొంది. రాజకీయ పార్టీల్లో దేశభక్తి లోపించడం వల్లే  కొత్త సైన్యాధ్యక్షుడి నియామకాన్ని ప్రశ్నిస్తున్నాయంది. విపక్షాల వ్యాఖ్యల వల్ల సైనికదళాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని  పార్టీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆర్మీ చీఫ్‌ నియామకానికి 10, జన్‌పథ్‌ (సోనియా గాంధీ అధికార నివాసం) అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలను సమయం వచ్చినపుడల్లా ప్రశ్నించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఆరోపించారు.

మరిన్ని వార్తలు