క్వారంటైన్‌ సెంటర్‌లో కొట్టుకున్నారు

17 May, 2020 09:48 IST|Sakshi

పట్నా : కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లు గొడవలకు కేంద్రంగా మారుతున్నాయి. తాజాగా క్వారంటైన్‌ సెంటర్‌లో నీళ్ల కోసం కొట్టుకున్న ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లా పుల్హారా టౌన్‌లో ఉన్న పాఠశాలను తాత్కాలిక క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చారు. ఈ క్వారంటౌన్‌ సెంటర్‌లో దాదాపు 150 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా వీరిని ఐసోలేషన్‌లో ఉంచారన్న మాటే గానీ ప్రభుత్వం వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. తాజాగా వీరు ఉంటున్న ఐసోలేషన్‌ కేంద్రానికి ఒక వాటర్‌ట్యాంకర్‌ వచ్చింది. మొదట్లో భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వాళ్లు నీళ్లు పట్టుకొని వెళుతున్నారు. ఇంతలో చిన్నపాటి గొడవ చోటుచేసుకొంది. అది క్రమంగా పెరిగిపోయి ఒకరిని ఒకరు తోసుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ బకెట్లు, బిందెలు ఏది పడితే అది విసురుకున్నారు. దీంతో ఐసోలేషన్‌ కేంద్రం కాస్తా రణరంగంగా మారింది.

దీనిని ఒక వ్యక్తి తన ఫోన్‌లో బంధించి షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే పోలీసులను పంపించి పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పటివరకు బీహార్‌లో కరోనా కేసులు వెయ్యి దాటగా మృతుల సంఖ్య 7కు చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 90, 927కి చేరుకుంది. ఇక వైరస్‌ సోకి 2872 మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 38,108 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,946 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
(రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు