తమిళనాట చతుర్ముఖ పోరు?

24 Apr, 2016 04:15 IST|Sakshi
తమిళనాట చతుర్ముఖ పోరు?

అన్నా డీఎంకే - డీఎంకేల మధ్య ప్రధాన పోరాటం
జయ సర్కారు అధికారం నిలుపుకునే అవకాశం

 
 చిరకాలంగా తమిళనాడులో ప్రాంతీయ పార్టీల రాజ్యమే కొనసాగుతోంది. అయితే.. 1977-88 మధ్య ఎంజీఆర్ 11 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. ఈసారి మాత్రం జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు అధికారం నిలుపుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల పోరాటంలో మాత్రం అన్నా డీఎంకే, డీఎంకేలతో పాటు.. డీఎండీకే, పీఎంకేలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి. దీంతో.. ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటం సాగనుంది.
 
 జయకు మంచి ప్రజాదరణ
 అధికార అన్నా డీఎంకే కొన్ని చిన్న పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తోంది. మొత్తం 234 స్థానాల్లో ఏడు స్థానాలను జయలలిత తన మిత్రపక్షాలకు కేటాయించారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల నేత ఆమె. అమ్మ పేరుతో జయ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో ఆమె ప్రతిష్టను పెంపొందించాయి. గత రెండు విడతల పాలనలో ఆమెపై ఎటువంటి తీవ్ర అవినీతి ఆరోపణలూ రాకపోవటం మరో సానుకూలాంశం. అయితే.. పాత అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి రావటం, ఇటీవలి వరదల్లో ప్రభుత్వ వైఫల్యం, సంక్షేమ పథకాలు అందరికీ అందకపోవటం వంటి అంశాలు.. అధికార పక్షం గెలుపును అంత సులువు చేయబోవని భావిస్తున్నారు.

 కోలుకోని కరుణానిధి
 గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కుదేలైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. కరుణానిధి సారథ్యంలోని డీఎంకే అవినీతి ఆరోపణలు కుటుంబ కలహాలతో ఇంకా కోలుకోలేదు. కాంగ్రెస్‌తో కలిసి ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. రెండేళ్ల కిందట శ్రీలంక తమిళుల అంశంపై విడిపోయిన ఈ రెండు పార్టీలూ మళ్లీ ఈ ఎన్నికల్లో చేతులు కలిపాయి. 92 ఏళ్ల వయసున్న కరుణానిధి వృద్ధాప్యంలోనూ రాజకీయ చతురుతతో ముందుకు వెళుతున్నారు. డీఎండీకే వంటి ఇతర పార్టీలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే జయకు కరుణ గట్టి పోటీ ఇవ్వగలరు.

 విజయ్‌కాంత్‌కు డిమాండ్
 ఇక రాజకీయ నాయకుడిగా మారిన మరో ప్రముఖ నటుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కెప్టెన్ విజయ్‌కాంత్.. ఆయన పార్టీ డీఎండీకే కూడా ఈ ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపుతుందని అంచనా. వన్నియార్ సామాజికవర్గం ప్రధాన ఓటు బ్యాంకుగా గల డీఎండీకే.. తొలిసారి 2006లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి పది శాతం ఓట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 స్థానాల్లోనూ పోటీచేసి మరింత మెరుగైన ఓట్ల వాటా సాధించింది. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఆ పార్టీతో వేరుపడి అధికారిక గుర్తింపు గల ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఈ పార్టీ సాధిస్తున్న ఓట్ల శాతం ఇతర పార్టీలను అమితంగా ఆకర్షిస్తోంది. తమిళనాట గట్టి పాగా వేసేందుకు డీఎండీకేతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఆయన తమతో చేయి కలుపుతారని డీఎంకే ఆశిస్తోంది. అయితే విజయ్‌కాంత్.. వామపక్షాలు, ఎండీఎంకే తదితర పార్టీలతో జట్టుకట్టి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ఒక కూటమిగా బరిలోకి దిగుతున్నారు. ఈ ఫ్రంట్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్‌ను ప్రకటించింది. మరోవైపు విజయ్‌కాంత్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు అధికార అన్నా డీఎంకే 40 మంది వరకూ వన్నియార్ సామాజిక వర్గ అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఇక ఫ్రంట్‌లో చేరాలన్న విజయ్‌కాంత్ నిర్ణయాన్ని పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూల పరిణామాలతో పాటు.. విజయ్‌కాంత్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. ఇటీవలే తనను చుట్టుముట్టిన జర్నలిస్టులపైకి ఆగ్రహంగా చేయి ఎత్తి కొట్టబోవటం వంటి ఉదంతాలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయని పరిశీలకులు భావిస్తున్నారు.

 బీజేపీ ఒంటరి పోరాటం
 డీఎండీకే, వైకోలతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ఆశించిన బీజేపీ.. చివరికి ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి. పొత్తుకు డీఎండీకే నిరాకరించగా.. బీజేపీతో దోస్తీకి ఎండీఎంకే నేత వైకో గుడ్‌బై చెప్పారు. అనంతరం డీఎండీకేతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు.

మరిన్ని వార్తలు