యూకే వీసా మరింత ఖరీదు 

9 Jan, 2019 01:49 IST|Sakshi

లండన్‌: భారతీయులకు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో సభ్యత్వం లేని దేశా లకు చెందిన పౌరులకు బ్రిటన్‌ వీసా మరింత ఖరీదు కానుంది. ఇమిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌చార్జ్‌ను (ఐహెచ్‌ఎస్‌) బ్రిటన్‌ ప్రభుత్వం పెంచడంతో భారతీయులపై ఆర్థిక భారం భారీగా పడనుంది. బ్రిటన్‌లో నివాసమున్నప్పుడు వారి ఆరోగ్య సంరక్షణ కోసం నేషనల్‌ హెల్త్‌ సర్వీసు(ఎన్‌హెచ్‌ఎస్‌) పరిధిలోకి వచ్చేలా 2015 నుంచి బ్రిటన్‌ ప్రభుత్వం హెల్త్‌ సర్‌చార్జ్‌ను వసూలు చేస్తోంది. భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే సర్‌చార్జ్‌ని చెల్లించాల్సి ఉం టుంది. ఇప్పుడు ఈ సర్‌చార్జ్‌ని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇన్నాళ్లూ ఈ సర్‌చార్జీ ఏడాదికి 200 పౌండ్లు(రూ.18వేలు) ఉంటే, ఇప్పుడు దానిని 400 పౌండ్లు (రూ.36వేలు) చేసింది. కొత్త చార్జీలు జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సర్‌చార్జీలను పెంచడమే కాదు, ఇంగ్లండ్‌కు వచ్చే విదేశీ విద్యార్థులకు అడ్డుకట్ట వేయడానికి పలు చర్యల్ని చేపట్టనుంది.

కేవలం ప్రతిభ ఆధారంగానే విద్యార్థులు రావడానికి అనుమతులు మంజూరు చేస్తామని బ్రిటన్‌ హోంమంత్రి సాజిద్‌ జావేద్‌ వెల్లడించారు. ఈయూ నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు కల్పిస్తే ఏడాదికి కనీసం 30వేల పౌండ్లు (రూ.27 లక్షలు) వేతనం ఇచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. 30వేల పౌండ్లు వేతనం అన్నది చాలా ఎక్కువనీ, అలా చేస్తే నర్సుల వంటి ఉద్యోగాల కోసం ఈయూ మీదనే ఆధారపడ్డ వారికి చాలా నష్టం జరుగుతుందని నేషనల్‌ హెల్త్‌ సర్వీసు సహా పలు సంస్థల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. లండన్‌ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతిబంధకంగా మారతాయని లండన్‌ నగర మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చే బ్రెగ్జిట్‌ రిఫరెండం ఆమోదం పొందిన దగ్గర్నుంచి బ్రిటన్‌కు వలస వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. 2014–15లో 3 లక్షల మందికి పైగా ఇతర దేశాల విద్యార్థులు, ఉద్యోగులు వలసవస్తే, గత ఏడాది వారి సంఖ్య 2 లక్షల 80వేలకు తగ్గిపోయింది.  

మరిన్ని వార్తలు