నిజంగా ‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది’!

16 Nov, 2019 15:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పప్పు దినుసులతోపాటు కూరగాయ ధరలు మండిపోతున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్భణం గత అక్టోబర్‌ నెలలో 4.62 శాతానికి చేరుకొని 16 నెలల్లో గరిష్ట స్థాయి రికార్డును నెలకొల్పింది. మరోపక్క నేరాలు ఘోరంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది....’ అని ఓ తెలుగు సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ పాత్ర పదే పదే వాపోతుంది. అదేం లేదు, ‘దేశంలో విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏమి కావాలి?’ మన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడీ శుక్రవారం సవాల్‌ చేశారు. 

రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనాల ప్రకారం ద్రవ్యోల్పణం ఎప్పుడూ నాలుగు శాతం లోపలే ఉండాలి. దాన్ని దాటిందంటే దేశంలో ఆర్థిక మాంద్యపు ప్రమాద ఘంటికలు మోగినట్లే. దేశంలో కూరగాయలు ఒక్క నెలలోనే 26.1 శాతం పెరగ్గా,  పప్పు దినుసులు 11.72 శాతం పెరిగాయి. ఈ నెలలో ఢిల్లీలో కిలో ఉల్లి గడ్డలు 80 రూపాయలకు చేరుకోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించడం తెల్సిందే. గత నెలలో కిలో 55 రూపాయలుండగా, ఒక్క నెలలోనే పాతిక రూపాయలు పెరిగింది. మరో రెండు, మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ‘కేర్‌ రేటింగ్స్‌’ హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి త్రైమాసికానికి రిటేల్‌ ద్రవ్యోల్భణాన్ని నాలుగు శాతం లోపలికి తీసుకరాకపోతే ముప్పని తెలిపింది. 

గత సెప్టెంబర్‌ నెలలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం పడిపోయింది. గత ఎనిమిదేళ్లలోనే ఇది అత్యధిక శాతమని ఆర్థిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ ఐదుశాతానికి పడిపోయింది. గత ఐదేళ్లలో ఇదే కనిష్టం. ఇది నాలుగు–నాలుగున్నర శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని, అది జరిగితే కష్టకాలం వచ్చినట్లేనని ఐసీఐసీఐలో ఆర్థిక వేత్తగా పనిచేస్తున్న ఏ. దేవ్‌ధర్‌ హెచ్చరించారు. జీడీపీ రేటు పడిపోయినప్పుడల్లా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటికే బాగా తగ్గించారని, మరింత రెపో రేట్లను తగ్గించడం సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశం సుభిక్షంగా ఉన్నట్లు సురేశ్‌ అంగడి మాట్లాడారు. దేశంలో విమానాలు, రైళ్లు కిటకిటలాడితే సామాన్య ప్రజలకు కష్టాలు లేనట్లేనా! అందుకేనా పలు రైళ్లలో టిఫిన్లు, భోజనం చార్జీలను భారీగా పెంచింది?!

మరిన్ని వార్తలు