మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు

26 May, 2020 13:14 IST|Sakshi

ల‌క్నో: ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ల‌పై అస‌భ్య‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేసిన కార‌ణంగా కాంగ్రెస్ నాయ‌కురాలు అల్క లంబాపై కేసు న‌మోదైంది. ట్విటర్ వేదిక‌గా ఓ వీడియోలో ప్ర‌ధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌లు త‌మ బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌ట్లేద‌ని ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముస్లిం, ద‌ళిత కార్డుల‌ను ఉప‌యోగించి రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.
(లాక్‌డౌన్ ఎఫెక్ట్‌‌: స్వచ్ఛంగా మారుతున్న యమునా నది)

'బేటీ బ‌చావో' అని నిన‌దించిన మోదీ.. త‌న సొంత పార్టీలోని వ్య‌క్తులే ఆడ‌పిల్ల‌ల‌పై ఆఘాయిత్యాలు చేశారన్న సంగ‌తి మర్చిపోరాద‌న్నారు. ఉన్నావ్ అత్యాచార ఘ‌ట‌న‌లో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ని దోషిగా పేర్కొంటూ.. మోదీ మొద‌లుపెట్టిన బేటీ బ‌చావో కార్య‌క్ర‌మాన్ని ఫ్లాప్ షోగా అభివర్ణించారు. భార‌త‌దేశ ఆడ‌పిల్ల‌ల‌ను ర‌క్షించుకోవ‌డంలో, బాధితుల‌కు న్యాయం చేయ‌డంలో మోదీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. అల్క లంబా చేసిన వ్యాఖ్య‌ల‌పై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 504, 505 (1) (బి) మరియు 505 (2) సెక్షన్ల కింద లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సోష‌ల్ మీడియాలో అల్క లంబాకు వ్య‌తిరేకంగా బీజేపీ నేత‌ల పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే త‌నపై కేసు న‌మోదు కావ‌డం ప‌ట్ల అల్క లంబా స్పందిస్తూ.. నిజానికి నేను మాట్లాడిన ఆ వీడియో ఏడాది క్రితం నాటిది. బీజేపీ భ‌క్తులకు నాకు వ్య‌తిరేకంగా ఏమీ దొర‌క‌లేదేమో, అందుకే సంవ‌త్స‌రం క్రితం నాటి వీడియోను త‌వ్వారు అంటూ బీజేపీ నేత‌ల‌పై ఫైర్ అయ్యారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్ )


 

మరిన్ని వార్తలు