-

'ఆ నిర‌స‌న‌లు ఇక్క‌డా జ‌ర‌గాలి'

5 Jun, 2020 15:20 IST|Sakshi

బెంగ‌ళూరు: ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు, మాన‌వ‌ హ‌క్కుల కార్య‌క‌ర్త ఆకార్ ప‌టేల్‌పై బెంగుళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అమెరికాలో న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్య‌పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేపట్టిన‌ విష‌యం తెలిసిందే. ఈ నిర‌స‌న‌లు దేశంలోని ప‌లు న‌గ‌రాల‌కు పాకాయి. ఈ నేప‌థ్యంలో ప‌టేల్ అగ్ర‌రాజ్యంలో చేప‌ట్టిన అల్ల‌ర్ల వీడియోల‌ను మే 31న‌ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. మ‌న దేశంలోనూ మైనారిటీ ప్ర‌జ‌లు ఇలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వహించాలంటూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. దీనికి మైనారిటీలు, వెనుక‌బ‌డిన‌వారు, పేద‌లు, మ‌హిళ‌లు అంద‌రూ ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. (ఉద్యమ నినాదం.. 8.46)

దీంతో అత‌నిపై ఐపీసీ సెక్ష‌న్ 505 (1) (బి) - ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేయ‌డం లేదా ఏదేని విభాగానికి, వ్య‌క్తుల‌కు లేదా ప్ర‌జ‌ల ప్ర‌శాంత‌త‌కు భంగం క‌లిగేందుకు ప్ర‌య‌త్నించ‌డం‌, 153- అల్ల‌ర్లు జ‌రిపేందుకు ఉద్దేశ‌పూర్వ‌కంగా రెచ్చ‌గొట్ట‌డం, 117 - ప‌దిమందిని లేదా ప్ర‌జ‌ల‌ను నేరానికి ఉసిగొల్ప‌డం కింద అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. దీనిపై ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. ఆకార్ ప‌టేల్‌పై పోలీసుల వేధింపులు ఆపాల‌న్నారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కింత అత‌నికి మాట్లాడే హ‌క్కు ఉంద‌ని తెలిపారు. దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ నిర్భ‌యంగా త‌మ భావాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా శాంతియుతంగా నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డం నేరమేమీ కాద‌న్నారు. కాగా ఆకార్ ప‌టేల్ గ‌తంలో ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. (ఊపిరాడకుండా చేసి ఫ్లాయిడ్‌ హత్య)

మరిన్ని వార్తలు