పబ్‌లు, బార్లలో జాగ్రత్త..!

31 Dec, 2017 09:46 IST|Sakshi

ముంబై ఘటనపై అగ్నిమాపక శాఖ అప్రమత్తం

సాక్షి, బెంగళూరు: ముంబైలోని కమల మిల్స్‌ భవనంపై ఉన్న పబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో నగర అగ్నిమాపక శాఖ విభాగం అప్రమత్తమైంది. ముంబై ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు ముఖ్యంగా ఇటువంటి భవనాల్లో ఉన్న పబ్‌లు, బార్‌లు, రెస్టోరెంట్లలో తనిఖీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్‌ సంబరాలకు ఎక్కువ మంది పబ్‌లు, బార్‌లలలో నిర్వహించుకోవడానికి యువత ఇష్టపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే నగరంలోని చాలా పబ్‌లు, బార్‌లు అగ్నిమాపశాఖ నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ను పొందకుండానే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 

నెటిజన్లు ట్వీట్‌లతో సమాచారం..
ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు నగరంలోని ఏఏ రెస్టారెంట్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ ఎం.ఎన్‌ రెడ్డికి ట్వీట్‌లతో సమాచారం అందించారు. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రముఖ మాల్‌లోని రెస్టారెంట్‌తో పాటు రూఫ్‌ టాప్‌ పబ్‌లకు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు ఇందిరానగరలోని అనేక పబ్‌లు ఇళ్లకు అనుమతులు పొంది అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎం.ఎన్‌ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఎం.జీరోడ్, బ్రిగేడ్‌రోడ్, ఇందిరానగర్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 

ఈ విషయంపై ఎం.ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ... ‘15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కిందికి రావడానికి వీలుగా అత్యవసర మెట్లు ఉండాలి. అంతేకాక అటువంటి భవనాల ముందు అగ్నిమాపక వాహనాల నిలుపుదలకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. ప్రతి అంతస్తులో అగ్నినిరోదక వస్తువులు తప్పక ఉండాలి. ఈ ఏర్పాట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.  

అధికారులు ప్రజలకు చెబుతున్న జాగ్రత్తలు  ..
∙పబ్‌లు, బార్‌లలో కిచెన్‌కు దగ్గరగా సిటింగ్‌ టేబుల్‌పై కూర్చొకపోవడమే ఉత్తమం.
∙మద్యానికి దగ్గరగా సిగరెట్‌ వంటి వస్తువులు ఉండకుండా చూడాలి.
∙పబ్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లే సమయంలోనే అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి
∙అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను ఉపయోగించకపోవడమే మేలు  

మరిన్ని వార్తలు