అమర్‌నాథ్‌ యాత్రకు భారీ భద్రత

1 Jul, 2019 03:37 IST|Sakshi

శ్రీనగర్‌/జమ్మూ: పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్‌గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్‌నాథ్‌ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్‌నాగ్‌ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్‌ మార్గం, గండేర్‌బల్‌ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్‌ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్‌ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్‌ బేస్‌ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు