మణిపూర్​లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

24 Mar, 2020 13:55 IST|Sakshi

ఇంఫాల్ : ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు కోవిడ్ -19 (కరోనా) మహమ్మారి క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకినట్టైంది. ఉత్తర ఇంపాల్‌కు చెందిన యువతి (23)కి వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారించారు. యూకేలో చదువుకుంటున్న ఈమె ఇటీవల  తిరిగి వచ్చినట్టు సమాచారం. దీంతో ఆమె కుటుంబ సభ్యులను క్వారంటైనలో వుంచారు. అయితే ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

కాగా దాదాపు మొత్తం భారతదేశంలో 32 రాష్ట్రాలు,560 జిల్లాలను కలిగి ఉన్న కేంద్ర భూభాగాలు పూర్తి లాక్ డౌన్ లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు దేశంలోనే అత్యధికంగా 101 పాజిటివ్  కేసులతో మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. 95 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందుతూనే ఉంది, మొత్తం కేసుల సంఖ్య 381,761 కు చేరగా ఇప్పటివరకు 16,558 మంది మరణించారు.

మరిన్ని వార్తలు