రెండో రోజూ తప్పని తిప్పలు

27 May, 2020 04:17 IST|Sakshi

పలు విమాన సర్వీసుల రద్దు 

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు రెండో రోజు మంగళవారం కూడా సమస్యలను చవిచూశారు. దేశవ్యాప్తంగా పలు సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం నుంచి దేశీయ పౌర విమాన సేవలు ఆరంభం అయిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 325 విమానాలు గమ్యస్థానాలకు బయల్దేరగా, 283 విమానాలు గమ్యస్థానాలకు చేరుకున్నాయి. మొత్తం 41,673 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్టు పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు. బెంగాల్‌ రాష్ట్రం నుంచి ఒక్క సర్వీసు కూడా నడవలేదు. చెన్నై విమానాశ్రయం నుంచి 20 విమానాలు టేకాఫ్‌ తీసుకోగా, మరో 20 ల్యాండయ్యాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 277 విమాన సర్వీసులకుగాను, 25 రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయం కేవలం 20 సర్వీసులను నిర్వహించింది. ముంబై, చెన్నై, హైదరాబాద్‌ విమానాశ్రయాలు విమానాల సంఖ్యపై పరిమితులు విధించాయి. కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే ఆ విషయం తెలియడంతో వారి నుంచి నిరసన వ్యక్తం అయింది.

తొలిరోజు 428 విమాన సర్వీసులే 
దేశీయంగా పౌర విమాన సేవలు ప్రారంభమైన సోమవారం 428 విమాన సర్వీసులు నడిచినట్టు పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. 832 విమాన సర్వీసులు నడిచినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేసిన కొద్ది గంటల తర్వాత సంబంధిత శాఖ నుంచి మంగళవారం ఈ ప్రకటన విడుదల అయింది.

>
మరిన్ని వార్తలు