ఓట్లకు, సీట్లకు.. పొంతన ఉండాలా? వద్దా?

22 Aug, 2017 04:33 IST|Sakshi
ఓట్లకు, సీట్లకు.. పొంతన ఉండాలా? వద్దా?

మెజారిటీ జనామోదం లేకుండానే... ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.  పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లు సాధిస్తేనే జనామోదం ఉన్నట్లు పరిగణించాలనేది ఒక వాదన. ఎందుకంటే ఒకతను 50 శాతం పైచిలుకు ఓట్లు సాధించాడంటే సదరు అభ్యర్థికి అక్కడి ఓటర్లలో విస్పష్టమైన ఆదరణ ఉన్నట్లు లెక్క (మరెవరికీ 50 శాతం దాటే అవకాశాలుండవు కాబట్టి). ప్రస్తుతం మనం అనుసరిస్తున్నది ‘ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ (ఎఫ్‌పీటీపీ) విధానం. పరుగు పందెంలో ఎందరు పాల్గొన్నా... మొదట గీత దాటిన వాడే గెలిచినట్లుగా ప్రకటిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ అనే పేరు ఈ ఎన్నికల విధానానికి పెట్టారు.

అభ్యర్థులందరిలోకి ఎవరికి ఎక్కువ ఓట్లు (ఒక్క ఓటు మెజారిటీ ఉన్నా సరే) వస్తే అతనే గెలిచినట్లు. మొత్తం పోలైన ఓట్లలో అతనికి ఎంత శాతం ఓట్లు పడ్డాయనే దానితో సంబంధం లేదు. త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొన్న సందర్భాల్లో 27 లేదా 28 శాతం ఓట్లు పొంది కూడా ఒక అభ్యర్థి గెలవచ్చు. అంటే మిగతా 72 శాతం అతన్ని తిరస్కరించారనే అర్థం. నియోజకవర్గంలోని మెజారిటీ ప్రజలు అతన్ని తిరస్కరించినప్పటికీ సదరు అభ్యర్థి ఆ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా చట్టసభలోకి అడుగుపెడతాడు. మన దగ్గర లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎఫ్‌పీటీపీ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.

రెండోది... ప్రపోర్షనల్‌ రిప్రజెంటేషన్‌ (పీర్‌ విధానం). ఓట్ల శాతానికి సమానంగా ప్రాతినిధ్యం. అంటే ఒక పార్టీకి ఎంత శాతం ఓట్లు పొలవుతాయో... మొత్తం సీట్లలో అంత శాతం ఆ పార్టీకి కేటాయిస్తారు. ఇందులో మళ్లీ రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో... లిస్ట్‌ పద్దతి. పార్టీలు మొత్తం స్థానాలకు సరిపడా అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను ఎన్నికలకు ముందే ఈసీకి అందిస్తాయి. ఇందులో అభ్యర్థుల పేర్లను ప్రాధాన్యక్రమంలో పొందుపరుస్తాయి. పార్టీకే ప్రజలు ఓటేస్తారు. వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి... అంతకు సమానశాతం సీట్లను పార్టీ పొందుతుంది. రెండో పద్దతి... సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓటు. ఓటర్లు బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యక్రమంలో ఓటేస్తారు.

ఎవరికైనా 50 శాతానికి మించి తొలి ప్రాధాన్య ఓట్లు పడితే అతను గెలుపొందినట్లే. ఎవరికీ 50 శాతానికి మించి తొలి ప్రాధాన్య ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. అభ్యర్థులందరిలోకి అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పించి సదరు అభ్యర్థికి వచ్చి రెండో ప్రాధాన్య ఓట్లను మిగతా వారికి కేటాయిస్తారు. ఇలా బరిలో ఉన్నవారిలో ఏ ఒక్కరికైనా 50 శాతం పైచిలుకు ఓట్లు వచ్చేదాకా ఎలిమినేషన్‌ జరుగుతుంది. మన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తాం.

చర్చ ఎందుకు?
ఆనంద్‌ శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (పర్సనల్, ప్రజా ఫిర్యాదులు, చట్ట, న్యాయ అంశాలపై) ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఎఫ్‌పీటీపీ విధానం సరైనది కాదేమోననే సందేహాలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను పార్టీల పేర్లు తీసుకోకుండా ఉదహరించింది. 39 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీజేపీ) 312 సీట్లు (మొత్తం యూపీ అసెంబ్లీ బలం 403) సాధించగా... 22 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (సమాజ్‌వాది) కేవలం 47 సీట్లు. 21 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీఎస్పీ) కేవలం 19 సీట్లు మాత్రమే పొందాయని... గుర్తుచేసింది. జనాదరణకు, వచ్చిన సీట్లకు పొంతన ఉండటం లేదు కాబట్టి... మరేదైనా ప్రత్యామ్నాయ విధానాలు, వాటి అమలులోని సాధ్యాసాధ్యాలను  సూచించాలని ఎలక్షన్‌ కమిషన్‌కు, అన్ని రాజకీయపార్టీలకు లేఖలు రాసింది.

పొంతన లేని అంకెలు...

  • బీజేపీ 2014 ఎన్నికల్లో 31 శాతం ఓట్లతో 282 సీట్లు సాధించింది. మన దేశ చరిత్రలో మరే సందర్భంలోనూ ఇంత తక్కువ ఓట్ల శాతంతో సొంత మెజారిటీ ఒక పార్టీకి రాలేదు.
  • ఓట్లశాతంలో బీజేపీ, కాంగ్రెస్‌ల తర్వాత దేశంలోనే మూడోస్థానంలో నిలిచిన బీఎస్పీకి (4.1 శాతం ఓట్లు) ఒక్క సీటు కూడా రాలేదు.
  • అదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ 3.8 ఓట్ల శాతంలో 34 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది.
  • అన్నాడీఎంకే కేవలం 3.3 ఓట్ల శాతంతో ఏకంగా 37 సీట్లలో గెలిచింది.
  • మరోవైపు 19.3 శాతం ఓట్లు సాధించి కూడా కాంగ్రెస్‌ 44కే పరిమితమైంది.
  • అదే 2009లో బీజేపీకి 18.5 శాతమే ఓట్లొచ్చినా... ఏకంగా 116 సీట్లు గెలిచింది.
  • 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 49.1 శాతం ఓట్లతో ఏకంగా 405 స్థానాల భారీ మెజారిటీ సాధించినా... ఓట్లశాతం పరంగా చూస్తే (వచ్చిన ఓట్ల 50 శాతం దాటలేదు కాబట్టి) మెజారిటీ ప్రజల ఆమోదం ఉన్న ప్రభుత్వం కాదనే వాదనా ఉంది.
  • కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన పార్టీలు... తక్కువ ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు నెగ్గుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నప్పటికీ కొన్ని పార్టీలు తక్కువ సీట్లు గెలుస్తున్నాయి. ఉదాహరణకు సీపీఎం (3.25 శాతం)కు 2014 సాధారణ ఎన్నికల్లోఅన్నాడీఎంకేతో దాదాపు సమానంగా ఓట్ల శాతం వచ్చినప్పటికీ 9 సీట్లే నెగ్గింది.

http://img.sakshi.net/images/cms/2017-08/81503345970_Unknown.jpg


ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ విధానం
అనుకూలతలు...
1. సులభమైనది. నిరక్షరాస్యులు కూడా తేలిగ్గా అర్థం చేసుకోగలరు.
2. మెజారిటీ ఓటు (50 శాతం పైచిలుకు)తో సంబంధం లేకుండా సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
3. పార్టీల సిద్ధాంతాలతో పాటు అభ్యర్థి గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయానికి వచ్చే అవకాశం ఓటరుకు ఉంటుంది.
4. అభ్యర్థికి తనకంటూ ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంటుంది.
5. అన్ని మతాలు, సామాజికవర్గాలను మెప్పించేందుకు అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది.
6. ప్రజల్లో ఆదరణ ఉంటే స్వతంత్య్ర అభ్యర్థిగానూ పోటీచేసి గెలవొచ్చు.

ప్రతికూలతలు...
1. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నా... నియోజకవర్గాల్లో పట్టులేని కారణంగా కొన్ని పార్టీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. 2014లో బీఎస్పీ విషయంలో జరిగిందిదే. ఇప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని సామాజికవర్గాలున్నాయి.
2. అభ్యర్థులకు వచ్చిన ఓట్లు బదిలీ చేసే అవకాశం లేదు కాబట్టి ఓట్లు వృధా అవుతాయి. అదే ప్రాధాన్యక్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటే... మనం తొలి ప్రాధాన్య ఓటు వేసిన అభ్యర్థి ఓడిపోయినా... మన రెండో ప్రాధాన్య ఓటు ఆ నియోజకవర్గంలో విజేతను తేల్చడానికి పనికి వస్తుంది. ఓటు వృధా కావడమనేది ఉండదు.
3. ఎఫ్‌పీటీపీ విధానంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. భారత్‌ పలు సంకీర్ణ ప్రభుత్వాలనూ  చూసింది.
4. ఓట్లశాతంలో స్వల్ప తేడా... కొన్నిసార్లు ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
5. అభ్యర్థులు తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి ఎన్నికల ఖర్చు అధికంగా ఉంటుంది.
6. కుల, మత, ప్రాంతీయ విభజనను ప్రోత్సహించేలా ఉంటుంది.

ఓట్ల శాతానికి తగ్గ ప్రాతినిధ్య విధానం...
అనుకూలతలు...
1. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ఖర్చు చాలా తక్కువ.
2. దేశవ్యాప్త ఉనికి ఉన్న చిన్నపార్టీలు, మైనారిటీ, మహిళల పార్టీలకు వారికి వచ్చిన ఓట్లను బట్టి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కుతుంది.
3. సమస్యలపై గెలిచిన అభ్యర్థుల్లో ఎవరినైనా సంప్రదించవచ్చు. ఎవరో ఒక ఎంపీకి పరిమితం కానక్కర్లేదు.
4. ఓటర్లలో తమ ఓటు వృధాగా పోయిందనే భావన ఉండదు. నచ్చిన సిద్ధాంతానికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు.

ప్రతికూలతలు...
1. గెలిచిన అభ్యర్థులు మెజారిటీ వర్గాలపైనే దృష్టి పెట్టి... మిగతా వారిని పట్టించుకోకపోవచ్చు. అభ్యర్థిని ఎంచుకొనే స్వేచ్ఛ ఓటరుకు ఉండదు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని అంగీకరించాల్సిందే.
2. సుస్థిరత అంతగా ఉండదు. మెజారిటీ సాధించడానికి సంకీర్ణాలు తప్పవు.
3. ప్రజాప్రతినిధి– ప్రజలకు (ఓటర్లకు) మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండదు. పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాడు కాని నియోజకవర్గ ప్రజలకు కాదు. కాబట్టి ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించే అవకాశాలుంటాయి.
4. స్వతంత్య్ర అభ్యర్థులకు అవకాశం ఉండదు. ఏదో ఒక పార్టీ పేరుపైన పోటీచేయాల్సిందే.
5. గద్దెనెక్కిన పార్టీల్లో అధికారం ఏ కొద్దిమంది చేతుల్లోనో కేంద్రీకృతమయ్యే అవకాశాలుంటాయి.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు