పునర్వినియోగ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం!

22 May, 2016 13:09 IST|Sakshi

చెన్నై: పునర్వినియోగ రాకెట్ నిర్మాణ దిశగా ఇస్రో తొలి అడుగు వేయనుంది. అందుకు సంబంధించిన వింగ్డ్ ప్రోటోటైప్ ను సోమవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్సేస్ రీసెర్చ్ సెంటర్(ఇస్రో)నుంచి పరీక్షించనుంది. కక్షలో ఉపగ్రహాన్ని వదిలిన తర్వాత భూమి మీదకు తిరిగివచ్చే రాకెట్ తయారీ లో భాగంగా శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేయనున్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే ఉపగ్రహాలను ప్రయోగించే వ్యయాన్ని 10 రెట్లు తగ్గించవచ్చు. ఇప్పటివరకు ఇస్రో ఉపయోగించిన పీఎస్ఎల్వీ రాకెట్ తో సంబంధం లేకుండా తయారుచేస్తున్న ఈ రాకెట్లో హైపర్ సోనిక్ టెక్నాలజీని ఉపయోగించారు. భూమి నుంచి 70 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత తిరిగి 180 డిగ్రీల కోణంలో వెనుకకు మళ్లీ బంగాళఖాతంలోని ల్యాండింగ్ బేస్ లో రాకెట్ దిగనుంది. మొత్తం పది నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ ను తయారు చేసేందుకు 10 ఏళ్ల వ్యవధి అవసరమవుతుందని ఇస్రో డైరెక్టర్ కే శివన్ తెలిపారు. సోమవారం నిర్వహించనున్న ప్రయోగం విఫలం చెందితే బంగాళాఖాతంలో పేలి పోయే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 1.7 టన్నుల బరువుతో ఉన్న ఈ రాకెట్ కేవలం డమ్మీ మాత్రమేనని వివరించారు.

మరిన్ని వార్తలు