ఈ ఘర్షణలు మొట్టమొదటిసారి..

3 Jan, 2018 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఆందోళనతో మహారాష్ట్ర దద్దరిల్లడానికి దారితీసిన ‘బీమా కోరేగావ్‌’ యుద్ధం స్మారక దినోత్సవానికి 200 ఏళ్లు. అగ్రవర్ణమైన పెషావర్లకు, మహర్లతో (దళితులు) కూడిన బ్రిటిష్‌ సైన్యానికి మధ్యన 1818లో యుద్ధం జరిగింది. స్మారక స్థూపాన్ని మాత్రం కోరేగావ్‌లో 1851లో నిర్మించారు. దళితుల నాయకుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ 1927లో ఆ స్మారక స్థూపాన్ని సందర్శించి కోరేగావ్‌ రెజిమెంట్‌ సైన్యం సేవల గురించి గ్రామస్థులనుద్దేశించి ప్రసంగించారు. దాంతో 1927 నుంచే అధికారికంగా స్మారకోత్సవం ప్రారంభమైంది.

నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన దేశం నలుమూలల నుంచి దళితులు అక్కడికెళ్లి స్మారకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఆరేడు ఏళ్లుగా స్మారక స్థూపం వద్ద సందర్శకుల సందడి పెరగ్గా, ఈ రెండేళ్ల కాలంలో మరింత పెరిగింది. మరాఠాలు, దళితుల మధ్య సామరస్యపూర్వకంగానే ఎప్పుడూ ఈ కార్యక్రమం సజావుగా సాగుతూ వస్తోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవు. సందర్శకుల కోసం మరాఠీలే ఉచితంగా తాగునీటి స్టాళ్లను ఏర్పాటు చేసి ఆహారాన్ని కూడా ఉచితంగానే అందించే వారు.

తమ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాల్సిందిగా, ఇంట్లో భోజనం చేయాల్సిందిగా దళిత పర్యాటకులను మరాఠాలు ఇళ్లలోకి ఆహ్వానించేవారు. గ్రామంలోని గణేశ్‌ ధీరేంజ్‌ లాంటి ప్రముఖ మరాఠా కుటుంబీకులు దూరం నుంచే స్థూపాన్ని స్మరించేవారు ఈ సారే మొట్టమొదటిసారిగా  సామరస్య కార్యక్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తలు జరుగుతాయని ముందే ఊహించినట్లున్నారు స్థానిక భీమా పంచాయతీ సర్పంచ్‌ పర్యాటకులకు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎస్సీ మహిళ ఈసారి సర్పంచ్‌గా గెలిచారు. 

మరిన్ని వార్తలు