రికార్డు ప్రిన్సిపాల్ రాజీనామా..!

30 Dec, 2016 12:05 IST|Sakshi
రికార్డు ప్రిన్సిపాల్ రాజీనామా..!

కోల్ కతా: భారతదేశంలో కాలేజీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన తొలి హిజ్రాగా ఘనత వహించిన మనాబీ బందోపాధ్యాయ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. మూడు రోజుల కిందట తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ విషయాన్ని నదియా జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ గుప్తా వెల్లడించారు. కృష్ణగర్ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు రాజీనామా చేస్తూ మనాబీ బందోపాద్యాయ్ ఇచ్చిన లేఖను ఉన్నత విద్యాశాఖకు అందజేసినట్లు తెలిపారు. ఇటీవల డైరెక్టర్ ఆర్పీ భట్టాచార్యతో కూడిన నలుగురు అధికారుల బృందం కాలేజీని పరిశీలించింది. ఫ్యాకల్టీతో పాటు ప్రిన్సిపాల్ ను వారు కాలేజీలో జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మనాబీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

'కాలేజీ విద్యార్థులు మాత్రమే కాదు సహోద్యోగులు కూడా నాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. మరోవైపు స్టాఫ్ కూడా నన్నే అంటున్నారు. ఈ వేధింపులు భరించలేకపోతున్నాను. కాలేజీలో ప్రశాంత వాతావరణ ఉండాలని నేను భావిస్తుండగా, కొందరు ఆ పరిస్థితి లేకుండా చేస్తున్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వం నుంచి తనకు ఎంతో సహాయం లభిస్తున్నా.. కాలేజీ సిబ్బంది, విద్యార్థులు ఎందుకు నాపై కోపంగా ఉన్నారో అర్థం కావడంలేదు. ఈ మానసిక ఒత్తిడి భరించే కంటే రాజీనామానే నాకు ఉత్తమ మార్గంగా కనిపించింది. పరిస్థితుల కారణంగా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఆశలతో కాలేజీలో అడుగుపెట్టాను. కానీ ఇక్కడ ఎవరి సహకారం లేకపోవడంతో ఓడిపోతున్నాను' అని తన లేఖలో ప్రిన్సిపాల్ మనాబీ పేర్కొన్నారు.

ప్రస్తుతం మానాబీ(51)గా ఉన్న ఆమె.. గతంలో సోమనాథ్. 2003-04 సమయంలో కొన్ని కీలక ఆపరేషన్ల ద్వారా మహిళగా మారిపోయారు. అంతకుముందు 1995లో ఆమె దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ మ్యాగజీన్ ప్రచురించి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత కొన్ని యూనివర్సిటీలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన మనాబీ.. గతేడాది జూన్ 9న కృష్ణగర్ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఈ విధంగా హిజ్రా ఓ కీలక పదవిని చేపట్టడం చాలా గ్రేట్ అంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ఎలాంటి సహకారం లేకపోవడంతో తనకు ఈ బాధ్యతలు వద్దంటూ మనాబీ రాజీనామా లేఖను సమర్పించారు. ఆమె రాజీనామాను అంగీకరిస్తారా లేదా అన్నది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

మరిన్ని వార్తలు