బియాస్‌ నదిలో ఘోరం

19 May, 2018 09:00 IST|Sakshi
నీటిలో ఆక్సిజన్‌ అందక మరణించిన చేపలు

ధర్మశాల, హిమాచల్‌ప్రదేశ్‌ : బియాస్‌ నదిలో జీవజాలం భారీగా మృత్యువాత పడింది. నీటి కాలుష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. నది పరివాహక ప్రాంతంలోని ఓ చక్కెర ఫ్యాక్టరీ నుంచి విడుదలైన రసాయనాలు నీటిలో కలవడం వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

గురుదాస్‌ పూర్‌ జిల్లాలోని కిరి అఫ్‌గనా గ్రామానికి చేరువలో గల చధా షుగర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి విడుదలైన రసాయనాలు బియాస్‌ నదిలో నీటిలో కలిశాయి. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం ప్రమాదవశాత్తు రసాయనాలు నీటిలో కలిశాయని పేర్కొంది.

నది పరివాహక ప్రాంతంలో నివసించే వారు నీరు ఎరుపు రంగులోకి మారడం చూసి షాక్‌కు గురయ్యారు. వేల సంఖ్యలో చేపలు, జలచరాలు మరణించి తేలుతూ ఒడ్డుకు కొట్టుకురావడాన్ని గమనించి అధికారులకు సమాచారం చేరవేశారు. ముఖ్యంగా అమృతసర్‌, తరణ్‌, కపుర్తలా జిల్లాల్లో జలచరాలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.

షుగర్‌ ఫ్యాక్టరీలో మొలాసిస్‌ తయారుచేసే బాయిలర్‌ పేలుడు వల్ల రసాయనాలు నది నీటిలో కలిసినట్లు అమృతసర్‌ డిప్యూటీ కమిషనర్‌ కమల్‌దీప్‌ సింగ్‌ సంఘా వెల్లడించారు. రసాయనాల కలయికతో నీటిలో కరిగే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి జలచరాలు మరణించాయని పేర్కొన్నారు. నదిలో కలుషితమైన నీటిని తొలగించేంతవరకూ ప్రజలు నీటిని వినియోగించొచ్చదని కోరారు.

మరిన్ని వార్తలు