క‌రోనా: ఇక‌పై 5 రోజుల‌పాటు ఆస్పత్రిలోనే

20 Jun, 2020 12:44 IST|Sakshi

కేంద్రం నిర్ణయం ఏకపక్షం: సీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీ :  క‌రోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కి త‌ర‌లించే ముందు ఆస్పత్రిలోనే త‌ప్ప‌నిస‌రిగా అయిదు రోజుల పాటు ఐసోలేష‌న్ వార్డులోనే ఉంచాల‌ని ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఇంటి వ‌ద్దే స్వీయ నిర్భంధంలో ఉన్న‌వారిపై త‌ప్ప‌నిస‌రిగా నిఘా ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారు భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లే రాజ‌ధానిలో కేసులు మ‌రిన్ని పెరగడానికి కారణమై ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నా స‌మ‌స్య తీవ్ర‌మైతే వెంట‌నే హాస్పిట‌ల్‌కి త‌ర‌లించాలని పేర్కొన్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ స‌హా ఇత‌ర ఉన్న‌తాధికారుల‌కు లేఖ రాశారు. (రాహుల్‌-అమిత్‌ షా మధ్య ట్విటర్‌ వార్‌ )

అయితే కేంద్రం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై ఢిల్లీ ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్ప‌టికే వైద్యులు, న‌ర్సుల కొర‌త ఉంద‌ని ఇలాంటి ప‌రిస్థితుల్లో అంద‌రికి ఆస్పత్రిలో సేవ‌లందించ‌డం సాధ్య‌మేనా అని సూటిగా ప్ర‌శ్నించింది. ప్ర‌స్తుతానికి వేలాది మంది క‌రోనా రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నార‌ని, తాజా ఉత్త‌ర్వుల వ‌ల్ల పెద్ద సంఖ్య‌లో క్వారంటైన్ కేంద్రాలు, ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏక‌ప‌క్షంగా ఉంద‌ని దీని ద్వారా స్వ‌త‌హాగా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌నుకునే వారి సంఖ్య త‌గ్గుతుంద‌ని అన్నారు. ఫ‌లితంగా క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు. 

ప్ర‌స్తుతం దేశ రాజ‌ధానిలో 8,400 క‌రోనా బాధితులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నా క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇటీవ‌లే ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్‌కు కోవిడ్ నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా 24 గంట‌ల్లోనే 14,516 కొత్త క‌రోనా కేసులు నమోదుకాగా, 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. (భారత్‌: మరోసారి రికార్డు స్థాయిలో కేసులు )

మరిన్ని వార్తలు