అకౌంటెన్సీ వారి వారసత్వం...!

12 Mar, 2018 21:30 IST|Sakshi
కుంటుబసభ్యులతో బీఎం చతుర్వేది

అయిదు తరాల ‘సీఏ’ పరివార్‌

లిమ్కా బుక్, గిన్నిస్‌ రికార్డ్స్‌లో నమోదుకు కుటుంబ పెద్ద  యత్నం...

ఒకే కుటుంబం నుంచి (రక్తసంబంధీకులు) వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిని నిర్వహించిన ఘనత ప్రపంచంలోనే  తమ పరివారానిదేనని చతుర్వేది అనే సీఏ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. భారత వాణిజ్య రాజధాని ముంబయిలో బీఎం చతుర్వేది అండ్‌ కంపెనీ పేరు గల ఓ సీఏ సంస్థ అధిపతి ఈ మేరకు సవాల్‌ చేస్తున్నారు.  గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డ్స్, లిమ్‌కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదుకు ఈ కుటుంబపెద్ద బ్రిజ్‌మోహన్‌ చతుర్వేది దరఖాస్తు చేశారు.  మూడోతరానికి చెందిన బీఎం చతుర్వేది తన మనవరాలు మోహిని చతుర్వేది(అయిదోతరం) కఠినమైన సీఏ అర్హత పరీక్షలో నెగ్గి  వారసత్వంగా వస్తున్న కుటుంబ వృత్తిలో అడుగుపెట్టింది. 

తొలి అడుగు 1925లో...
ఉత్తరప్రదేశ్‌ మధురకు చెందిన బిషంబర్‌నాథ్‌ చతుర్వేది (బీఎం చతుర్వేది తాత) ఢిల్లీలోని ఓ సంస్థలో శిక్షణ పొందాక 1925లో సీఏ వృత్తి చేపట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మధురలోని దాదాపు 500 మంది ఛార్టెర్డ్‌ అకౌంటెన్సీ వృత్తిలోకే దిగారు. బిషంబర్‌ ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ (బీఎం చతుర్వేది తండ్రి), దీనానాథ్‌ సీఏ చేశారు. అమర్‌నాథ్‌ 1955లో ఈ వృత్తిలో చేరాక ఇరవై ఏళ్లకు బీఎం చతుర్వేది,ఇద్దరు సోదరులు కూడా అదేబాటలో పయనించారు.  చతుర్వేది తోడబుట్టిన సోదరులు, సోదరీమణుల పిల్లలు,   ఆయన మనవరాలు (చిన్నకుమార్తె బిడ్డ) ప్రత్యేక  వారసత్వాన్ని కొనసాగించడంలో చేతులు కలిపారు. 

ప్రస్తుతం డేవిడ్‌ కుటుంబం పేరిట...
ప్రస్తుతం నైజీరియాలోని డేవిడ్‌ ఒమ్యూయా డెఫినెన్‌ కుటుంబం పేరిట ఈ గిన్నెస్‌ రికార్డ్‌ నమోదై ఉంది. డేవిడ్‌ తర్వాతి తరంలో అయిదుమంది సీఏలు (ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు)న్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు సీఏ వృత్తిలో ఎక్కువ మంది (ఆరుగురు) కొనసాగుతున్నందున  ఈ విధంగా వీరిని ప్రపంచంలోని  తొలి కుటుంబంగా పరిగణిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా 11 మంది తన రక్తసంబంధీకులు సీఏలుగా ఉన్నారని చతుర్వేది చెబుతున్నారు. వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిలో కొనసాగడంతోపాటు 11 మంది సీఏలు ఒకే కుటుంబం నుంచి ఉన్నందున గిన్నెస్‌రికార్డ్‌ తమకే చెందుతుందని అంటున్నారు. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

>
మరిన్ని వార్తలు