అయోధ్య కేసు : అంతిమ తీర్పులో ఆ ఐదుగురు

9 Nov, 2019 12:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేసమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసు తుది విచారణలో భాగమైన రాజ్యంగ ధర్మాసనంలోని న్యాయమూర్తుల వివరాలు మీకోసం..

చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబర్‌ నియమితులయ్యారు. అస్సాంకు చెందిన గొగోయ్‌ ఈశాన్య రాష్ట్రాల నుంచి సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. గౌహతి హైకోర్టు, పంజాబ్‌ హరియాణా హైకోర్టులో ఆయన సీజేగా పనిచేశారు. 2012లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నార్సీ వంటి కేసుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గొగోయ్‌ నవంబర్‌ 17న పదవీ విరమణ చేయనున్నారు.

జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బాబ్డే : సీజేఐ రంజన్‌ గొగోయ్‌ రిటైర్‌మెంట్‌ తర్వాత సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బాబ్డే సీజేఐగా 18 నెలల పాటు కొనసాగనున్నారు. ఆయన 2000 ఏడాదిలో బాంబే హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా పనిచేశారు. 2002లో మధ్యప్రదేశ్‌ సీజేగా నియమితులయ్యారు. 2013లో సుప్రీం న్యాయమూర్తిగా వచ్చారు. బాబ్డే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ : సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలంపాటు పనిచేసిన వైవీ చంద్రచూడ్‌ తనయుడు. డీవై చంద్రచూడ్‌ 2016లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో బాంబే హైకోర్టు, అలహాబాద్‌ హైకోర్టు సీజేగా పనిచేశారు. వ్యభిచార చట్టం మరియు గోప్యత హక్కు వంటి కీలక కేసులో వాదనలు విన్నారు.

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ : 1970  నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అప్పటి నుంచే అయోధ్య వివాదంపై పలు దశల్లో పనిచేశారు. అలహాబాద్‌ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేశారు. అదే కోర్టుకు 2001లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో కేరళ హైకోర్టులో పనిచేశారు. కొన్ని నెలలపాటు కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ : 1983లో అడ్వొకేట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. కేరళ హైకోర్టులో 20 ఏళ్ల పాటు సేవలందించారు. 2003లో కేరళ హైకోర్టు అదనపు జడ్జిగా పనిచేశారు. 2004లో పూర్తి స్థాయిలో కేరళ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ట్రిపుల్‌ తలాక్‌ వాదనలు విన్న బెంచ్‌లో సభ్యుడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా