జార్ఖండ్‌లో ఐదుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌ 

30 Jan, 2019 02:12 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసుల చేతిలో నిషేధిత లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ)కి చెందిన ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. పీఎల్‌ఎఫ్‌ఐ.. సీపీఐ (మావోయిస్టు) సంస్థ నుంచి విడిపోయింది. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం పీఎల్‌ఎఫ్‌ఐకి చెందిన ఐదుగురు నక్సల్స్‌ మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు’ అని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఆపరేషన్‌) ఆశిష్‌ బాత్రా మంగళవారం వెల్లడించారు.

భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. కుంతి జిల్లాలోని ముర్హు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం 6.30 గంటలకు సీఆర్‌పీఎఫ్‌భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. మరణించిన నక్సల్స్‌లో ఏరియా కమాండర్‌ ప్రభు సహాయ్‌ బోద్ర ఉన్నారని, ఆయనపై రూ.2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 తుపాకులు, రెండు 315 తుపాకులు ఒక 9 ఎం.ఎం. పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. 

>
మరిన్ని వార్తలు