బీజేపీకి అనుకూలంగా పెద్దల సభ!

20 May, 2016 02:38 IST|Sakshi

తాజా ఫలితాలతో రాజ్యసభలో మారనున్న సమీకరణాలు
న్యూఢిల్లీ: తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజ్యసభలో సమీకరణాలు మారనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల గెలుపు.. పెద్దల సభను బీజేపీకి అనుకూలంగా మార్చనున్నాయి. ఇప్పటివరకూ రాజ్యసభలో సంఖ్యాబలం అధికంగా గల కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వ కీలక బిల్లులకు మోకాలడ్డుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. అయితే తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలతో పరిస్థితి మారనుంది.

జూన్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తగ్గనుంది. ఆ మేరకు ఎస్పీ, ఏఐఏడీఎంకే తదితర పార్టీల బలం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుతో కీలక బిల్లులకు మోక్షం కలుగుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లు 2015లోనే లోక్‌సభలో ఆమోదం పొంది, సంఖ్యాబలం లేకపోవడంతో రాజ్యసభ ఆమోదానికి నోచుకోక అలా ఉండిపోయింది. ఇలాంటి పెండింగ్ బిల్లుల విషయంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో రాజ్యసభలో గట్టెక్కవచ్చని బీజేపీ భావిస్తోంది.
 
సీట్లు తగ్గినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్సే! మొత్తం 57 రాజ్యసభ సీట్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ బలం 64. గత రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ 4 నుంచి 5 స్థానాలు కోల్పోనుంది. అయినప్పటికీ కాంగ్రెస్ బలం 60 వరకు ఉండటంతో 245 సభ్యులున్న రాజ్యసభలో అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొనసాగవచ్చు.

అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిపి బీజేపీ 22 సీట్లును పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 49. దీనికితోడు ప్రాంతీయ పార్టీలు మరిన్ని సీట్లు సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీకి అనుకూల పరిస్థితి నెలకొనే అవ కాశాలు ఎక్కువగా ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు