‘ఫ్లాగ్ షిప్’.. వేగం

1 Mar, 2016 03:13 IST|Sakshi
‘ఫ్లాగ్ షిప్’.. వేగం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేటాయింపుల జోరు...
గ్రామీణ భారత్‌కు మరింత జవసత్వాలు కల్పించడం... మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంగా కీలకమైన ‘ఫ్లాగ్‌షిప్’ పథకాలపై ప్రధాని మోదీ పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఆర్థిక మంత్రి జైట్లీ ఇందులోని అన్ని పథకాలకూ భారీగా నిధుల కేటాయింపులను పెంచడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా.. ఇప్పటికే స్వచ్ఛ భారత్ సెస్సును విధించిన కేంద్రం.. ‘క్లీన్’ సెస్సును మరింతగా పెంచడం ద్వారా అదనంగా నిధులను సమకూర్చుకోనుంది. మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి దాదాపు ఒకటిన్నర రెట్లు కేటాయింపులు పెరగడం గమనార్హం. ఇక వరుసగా రెండేళ్ల కరువు పరిస్థితులతో దుర్భల పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేయూత కల్పించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను కూడా భారీగానే పెంచారు. రెండేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకూ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం... చౌక గృహ నిర్మాణానికి పెద్దపీట వేయడం... పల్లెల్లో రోడ్లపై మరింతగా దృష్టిపెట్టడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి మోదీ సర్కారు ఈ బడ్జెట్‌లో గట్టి ప్రయత్నమే చేసింది.

ఉపాధికి ‘హామీ’...
201617 కేటాయింపు: రూ. 38,500 కోట్లు (11% పెంపు)
201516 కేటాయింపు: రూ. 34,699 కోట్లు(12% పెంపు)
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేసేవిధంగా ఉపాధి పనులను వాడుకోనున్నట్లు తాజా బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించారు.

 స్వచ్ఛ భారత్‌కు దన్ను...
భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా జైట్లీ గతేడాది సర్వీసు పన్నుకు (ప్రస్తుతం 14 శాతం) అదనంగా 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్సును అమల్లోకి తీసుకొచ్చారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని జైట్లీ బడ్టెట్ ప్రసంగంలో చెప్పారు. మరోపక్క, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి నిధుల కల్పన కోసం  క్లీన్ ఎనర్జీ సెస్ (క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్‌గా ఇప్పుడు పేరు మార్చారు)ను ఈ బడ్జెట్‌లో కూడా పెంచారు. బొగ్గు తదితర ఖనిజాలపై ఒక్కో టన్నుపై ఇప్పుడు విధిస్తున్న రూ.200 సెస్‌ను రూ.400కు చేరుస్తున్నట్లు జైట్లీ బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుద్ధ్యం), జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది.

స్వచ్ఛ భారత్ అభియాన్ రూ.9,000కోట్లు (గ్రామీణ)+ రూ.2,300 (పట్టణ)
201617  కేటాయింపు: రూ.9,000 కోట్లు (148 % పెంపు)
201516 కేటాయింపు: రూ.3,625 కోట్లు
2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం.

దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు.  ఎస్‌బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం.

♦  కాగా, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ర్యాంకింగ్‌లను ప్రవేశపెట్టింది. దీనివల్ల నగరాలు, పట్టణాల మధ్య నిర్మాణాత్మక పోటీకి తోడ్పడుతుందని జైట్లీ అన్నారు.

అదేవిధంగా ఎస్‌బీఏలో భాగంగా నగరాల్లోని చెత్తను కంపోస్టుగా మార్చే ఒక ప్రత్యేక పాలసీని ప్రభుత్వం ఆమోదించినట్లు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వెల్లడించారు.

జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
201617 కేటాయింపు: రూ. 5,000 కోట్లు (92% పెంపు)
201516 కేటాయింపు: రూ.2,611 కోట్లు(76% తగ్గింపు)
దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి.

 గ్రామీణ టెలిఫోనీ...
201617లో: రూ. 2,755 కోట్లు (15% పెంపు)
201516లో: 2,400 కోట్లు (32% తగ్గింపు)
2016 డిసెంబర్ కల్లా మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(ఎన్‌ఓఎఫ్‌ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన...
201617 కేటాయింపు: రూ. 8,500 కోట్లు (25% పెంపు)
201516  కేటాయింపు: రూ. 6,800 కోట్లు (32% పెంపు)
విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది.

2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని.. వచ్చే 1000 రోజుల్లో వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ హామీనిచ్చారు.

దీనిలో భాగంగానే 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించారు.

తాజా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.3,000 కోట్లు, ఫీడర్‌లను వేరుచేసే కార్యక్రమం వంటి వాటికి (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్స్) రూ.5,000 కోట్లు చొప్పున కేటాయించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16 ఫిబ్రవరి 23 నాటికి)లో కొత్తగా 5,542 గ్రామాలను విద్యుదీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో మొత్తం విద్యుదీకరించిన గ్రామాలకంటే ఇది అధికమని కూడా జైట్లీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన
201617 కేటాయింపు: రూ.20,075 (41% పెంపు)
201516 కేటాయింపు: రూ.14,200 కోట్లు(11% కోత)
అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్టెజ్‌లో చౌక గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎంఎస్‌వైతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు(60 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణానికి మించని గృహాలపై) సేవా పన్నును(ప్రస్తుతం ఇది 5.6 శాతంగా ఉంది) పూర్తిగా తొలగిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చౌక గృహాలకు(60 చదరపు మీటర్ల వరకూ) సంబంధించిన ప్రాజెక్టులకు సైతం ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.

మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు.

మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.

పట్టణ ప్రాంతాల్లోని పేదల గృహ కల్పనకు సర్దార్ పటేల్ అర్బన్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు పెట్టారు.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
201617 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (33% పెంపు)
201516 కేటాయింపు: రూ.14,291 కోట్లు (0.7% తగ్గింపు)

మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం ఇది.

♦  గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మోదీ సర్కారు దీనికి ఈ బడ్జెట్లో దండిగానే నిధులను విదిల్చింది.

♦  ఈ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27 వేల కోట్ల నిధులు ఖర్చు చేసే అవకాశం ఉందని జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు.

♦  2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

♦  2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73.5 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం 100 కిలోమీటర్లకు జోరందుకుందని.. దీన్ని మరింతగా పెంచనున్నట్లు కూడా జైట్లీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు