శాంతించిన నాగావళి!

17 Jul, 2017 22:55 IST|Sakshi
శాంతించిన నాగావళి!

తోటపల్లి  బ్యారేజీ 8గేట్లు మూసివేత
శ్రీకాకుళం జిల్లాకు తప్పిన వరద ముప్పు


శ్రీకాకుళం: గత మూడు రోజులుగా ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి పోటెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ప్రమాదస్థాయిలో ప్రవహించిన నాగావళి ఉధృతి ప్రస్తుతం కాస్త తగ్గింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి నాగావళి ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తోటపల్లి బ్యారేజీ 8 గేట్లు మూసివేశారు. కేవలం 7 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నారాయణపురం వద్ద 97 వేల క్యూసెక్కుల నీరు, శ్రీకాకుళం వద్ద 69 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షం ఇంకా భారీగా కురుస్తుండడంతో వరద పెరిగే అవకాశముందని, శ్రీకాకుళం జిల్లాకు మాత్రం వరద ముప్పు తప్పినట్టేనని జలవనరుల శాఖ బొబ్బిలి ఇంఛార్జి ఎస్‌ఈ నాగేశ్వరరావు చెప్పారు.

అప్రమత్తతతో తప్పిన ముప్పు..
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద నారాయణపురం ఆనకట్టకు గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగావళి నదిలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. వీటికితోడు తోటపల్లి ప్రాజెక్టు వద్ద 80,400 క్యూసెక్కుల నీటిని ఆదివారం రాత్రి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో ఒక్కసారిగా నాగావళి నదిలో వరద పెరిగి ఆనకట్టకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 1200 క్యూసెక్కులుగా ఉన్న వరద రాత్రి పది గంటల సమయంలో 40వేల క్యూసెక్కులకు చేరుకుంది. తోటపల్లి ప్రాజెక్టునీరు, మడ్డువలస నీరు రావడంతో 98 వేల క్యూసెక్కుల నీరు ఆనకట్టకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు.

దీంతో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కులపైబడి నీరు వస్తుండడంతో రేగిడి మండలంలో తునివాడ, సంకిలి, బొడ్డవలస, ఖండ్యాం, పుర్లి, కొమెర తదిర గ్రామాలతోపాటు సంకతవిటి మండలంలో కొత్తూరు రామచంద్రాపురం, పోతులజగ్గుపేట, మేడమర్తి, తమరాం, పోడలి, చిత్తారిపురం తదితర నదీతీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని గుర్తించిన అధికారులు వెంటనే ఆయా గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన కొద్ది సేపటికే వరద ఈ గ్రామాలను ముంచెత్తింది. అధికారుల అప్రమత్తత కారణంగా ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు.

మరిన్ని వార్తలు