పాన్పుపై సేదతీరిన పులి!

19 Jul, 2019 04:03 IST|Sakshi
దుకాణంలోని బెడ్‌పై పులి

అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కు ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామమది. పేరు హర్మోతి. మోతీలాల్‌ ఎప్పటిలాగే గురువారం ఉదయాన్నే తన పాత సామాను దుకాణంలో కూర్చున్నాడు. అంతలో బయట నుంచి ‘పులి పులి’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఎంటో చూద్దామని దుకాణం బయటకొచ్చిన మోతీలాల్‌కు గుండె ఆగినంత పనైంది. ఆయనకు ఎదురుగా కేవలం 20 అడుగుల దూరంలో బెంగాల్‌ టైగర్‌ ఉంది. అది మోతీలాల్‌ వైపే వస్తోంది. గాండ్రిస్తూ పెద్ద పులి తనవైపే వస్తుండటంతో మోతీలాల్‌ శరీరం భయంతో మొద్దుబారి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు. అయితే, బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్న ఆ పులి అతని కళ్లల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా.. అతని పక్కనుంచి దుకాణంలోపలికి వెళ్లింది.

విశ్రాంతి తీసుకునేందుకు దుకాణంలోపల ఉన్న మంచంపై సెటిలైంది. పులి లోపలికి వెళ్లిపోగానే బతికితే చాలురా బాబు అనుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తాడు మోతీలాల్‌. గ్రామంలోని పశువైద్యుడు శాంశుల్‌ అలీ అటవీ శాఖ అధికారులకు వెంటనే ఈ విషయం చేరవేశాడు. దీంతో అధికారుల బృందం హుటాహుటిన అక్కడికొచ్చింది. భారీ వర్షాల కారణంగా కజిరంగా జాతీయ పార్కు భూభాగం 95శాతం నీట మునిగిందని, దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర వన్యప్రాణుల్లాగే పులి కూడా జనావాసాల్లోకి వచ్చిందని అధికారుల అంచనా. పులికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి మళ్లీ పార్కులోకి తీసుకెళ్లి వదిలేయాలా? లేక తన దారిని అది పోయేదాకా వేచిఉందామా అని అధికారులు ఆలోచిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు