దేశ రాజధానిని ముంచెత్తిన వరద

30 Jul, 2018 08:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పురాతన యమునా బ్రిడ్జిపై రాకపోకలను నిలువరించారు. వరద పరిస్థితిని ఉన్నతస్ధాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అధికారులతో సమీక్షించారు. రెండు రోజులుగా కుండపోత వర్షాలతో ఢిల్లీ తడిసిముద్దయింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఇప్పటికే అత్యవసర సమావేశం నిర్వహించారు.

హర్యానాలోని హతింకుండ్‌ బ్యారేజ్‌ నుంచి నగరానికి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తలెత్తే పరిస్థితిపైనా ఆయన అధికారులతో సమీక్షించారు. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

పదివేల మందికి పైగా ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ప్రీత్‌ విహార్‌ నోడల్‌ అధికారి అరుణ్‌ గుప్తా చెప్పారు. ప్రజలకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా, ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలని, నిర్వాశితుల శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు.

రైళ్ల రద్దు, దారిమళ్లింపు..


ఢిల్లీలో వరద ముప్పు కారణంగా పురాతన యమునా బ్రిడ్జిని మూసివేయడంతో 27 పాసింజర్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. వరదల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పరిస్థితిని సమీక్షించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ను నెలకొల్పింది. యమునా నది ప్రమాదస్థాయిని చేరుకోవడంతో నదిపై ఢిల్లీ-హౌరా లైన్‌లో నిర్మించిన రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జిని మూసివేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 150 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జి ఢిల్లీని పొరుగు రాష్ట్రాలతో కలిపేందుకు ప్రధాన వారధిగా పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు