ఫ్లడ్‌లైట్ల వెలుగులతో మందగించిన కంటిచూపు

18 Mar, 2018 16:32 IST|Sakshi

కంటి ఆస్పత్రిలో 96 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: పాఠశాల వార్షికోత్సవ ఫ్లడ్‌లైట్ల వెలుగులు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాల్లో చీకట్లు నింపాయి. కళ్లను ఏమాత్రం తెరవలేని స్థితిలో 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు సహా 96 మంది కంటి ఆస్పత్రి పాలయ్యారు.

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా ఏర్వాడి పొత్తయడిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువులు చెప్పే ఎస్‌వీ హిందూ ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతిఏటా పాఠశాల మైదానంలో నిర్వహించే వార్షికోత్సవాన్ని ఈసారి ఇరుకైన ఒక తరగతి గదిలో జరిపారు. వార్షికోత్సవ అలంకారం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు వీలుగా ఇరుకైన ఆ తరగతి గదిలో కళ్లు మిరుమిట్లు గొలిపే పెద్ద పెద్ద లైట్లను అమర్చారు. ఈ లైట్ల నుంచి వెలువడుతున్న కాంతులు విపరీతంగా ఉండడంతో అందరికీ కళ్లు మంటలు పుడుతుండగా నలుపుకుంటూనే కార్యక్రమాలను వీక్షించారు.

ఇళ్లకు వెళ్లిన తరువాత అందరికీ కళ్లమంటలు అధికమై కనురెప్పలు తెరవలేని స్థితికి చేరుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్‌ బాలసుబ్రమణియన్‌కు శుక్రవారం రాత్రి నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతో శనివారం ఉదయం ఒక వ్యాన్‌లో బాధితులను ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు, ఐదుగురు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌ బాలసుబ్రమణియన్‌ సహా మొత్తం 96 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు