-

సామాజిక దూరానికి నాంది ‘నైటింగేల్‌’

27 Mar, 2020 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘ప్రతి నర్సు తరచుగా తన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులతోపాటు ముఖం కూడా కడుక్కోవడం ఇంకా మంచిది’ అని ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 1860లో చెప్పిన మాటలు కరోనా వైరస్‌ కలవర పెడుతున్న నేటి సమయంలో గుర్తుకు వస్తున్నాయి. ఆమె నర్సుల గురించి చెప్పినప్పటికీ ఆమె ఉద్దేశం ఒక్కటే. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటు రోగాలు రావని, తద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని. ఆమె 1860లో రాసిన ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ పుస్తకంలో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవాలి’ అనే విషయం ఉంది. (కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి)
 
ఆ పుస్తకంలో నర్సుల విధులేమిటీ? వాటిని ఎలా నిర్వర్తించాలో? చెప్పడం కంటే వ్యాధులకు ప్రజలు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే ఎక్కువగా ఉంది. ఇల్లు, పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా ఇంటికి కిటికీలు ఉండాలంటూ పలు సూచనలు చేశారు. ఆమె ఎక్కువగా తన సేవలను యుద్ధాల్లో గాయపడిన సైనికులకే కేటాయించారు. అప్పట్లో గాయపడిన సైనికులు ఇన్‌ఫెక్షన్ల వల్ల ఎక్కువ మంది చనిపోయేవారు. ఆమె ఎప్పటికప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడంతోపాటు, సైనికుల గాయాలను శుభ్రంగా తుడిచి చికిత్స అందించేవారు. ఆస్పత్రుల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేసేవారు. ఆమె ఓసారి భారత్‌లోని ఓ సైనికుల ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారట.

‘క్రిమియన్‌ వార్‌’ సమయంలో బ్రిటీష్‌ సైనిక ఆస్పత్రిలో నర్సింగ్‌ మేనేజర్‌గా ఆమె పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వైద్యపరమైన వైఫల్యాలపై ఆమె ఏకంగా 900 పేజీల నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఆ సమయంలో ఆమెకు ‘ది లేడి విత్‌ ది ల్యాంప్‌’ అనే నిక్‌ నేమ్‌ వచ్చింది. రాత్రివేళల్లో ఆమె దీపం పట్టుకొని గాయపడిన సైనికుల వద్దకు వెళ్లి పరామర్శించేవారు. ఆ యుద్ధానంతరం ఆమె ఫ్లూ లాంటి ‘బ్రూసెల్లాయిస్‌’ జబ్బు బారిన పడ్డారు. అప్పుడు ఆమె తనవద్దకు ఎవరూ రావద్దంటూ కుటుంబ సభ్యులను, తోటి నర్సులతో సామాజిక దూరం పాటించారు. ఒంటరిగా నిర్బంధంలో ఉన్నారు. ఆమె 1860లోనే సెయింట్‌ థామస్‌ హాస్పటల్‌లో నర్సుల కోసం ‘నైటింగేల్‌ ట్రెయినింగ్‌ స్కూల్‌’ను 1861లో కింగ్స్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో ‘మిడ్‌వైఫరీ ట్రేనింగ్‌ ప్రోగ్రామ్‌’ నిర్వహించారు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ నైటింగేల్‌ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని నర్సింగ్‌ సేవలకు అంకితమిచ్చి నాటి నుంచి నేటి వరకు నర్సింగ్‌కు మార్గదర్శకురాలిగా మిగిలిపోయారు. (లాక్‌డౌన్‌లో ఆకలి చావులను ఆపాలంటే...)

మరిన్ని వార్తలు