డిసెంబర్‌ 1 నుంచి డ్రోన్లకు అనుమతి

28 Aug, 2018 09:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి డ్రోన్ల వాడకానికి కంపెనీలు, వ్యక్తులను అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఫోటోగ్రఫీ, ఇతర రిక్రియేషనల్‌ అవసరాల కోసం ఆపరేటర్లు అనుమతులకై పోర్టల్‌లో (డిజిటల్‌ స్కై ఫ్లాట్‌ఫా) దరఖాస్తు చేసుకుని తక్షణ ఆమోదాలు పొందవచ్చని పేర్కొంది. కాగా ట్యాక్సీలు, డెలివరీ వాహనాలు, ఇతర సేవల వంటి డ్రోన్ల వాణిజ్య వినియోగాన్ని ప్రస్తుతం అనుమతించబోరు.సాంకేతికత పురోగతికి అనుగుణంగా దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలతో డ్రోన్‌ పరిశ్రమ బలోపేతానికి దోహదపడతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు.కాగా 250 గ్రాముల కంటే తక్కువ బరువున్న నానో డ్రోన్లకు అనుమతులు అవసరం లేదని, అయితే వీడి వాడకానికి ముందుగా ఆపరేటర్లు స్ధానిక పోలీసులకు సమాచారం అందించాలని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.

యూజర్లు తమ డ్రోన్లు, పైలెట్లు, యజమానులకు సంబంధించి ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, నానో డ్రోన్లు మినహా ప్రతి డ్రోన్‌కూ యూజర్లు మొబైల్‌ యాప్‌ ద్వారా అనుమతులు కోరవచ్చని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. డ్రోన్‌ గగనతలంలో అన్‌మ్యాన్డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ (యూటీఎం) ట్రాఫిక్‌ రెగ్యులేటర్‌గా వ్యవహరిస్తుంది.

మరిన్ని వార్తలు