రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి: దత్తాత్రేయ

16 Mar, 2017 01:09 IST|Sakshi
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి: దత్తాత్రేయ

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందిన బీజేపీ.. ఇక తెలంగాణలోనూ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. యూపీ ఫలితాలే బీజేపీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మున్ముందు తెలంగాణలోనూ పార్టీని పటిష్టపరచడానికి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్‌లో సమావేశం కానున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గోదావరి ఖనిలో బొగ్గు గని కార్మికులకు పీఎఫ్, పింఛన్లు సకాలంలో అందడానికి కోల్‌ ఇండియాకు సంబంధించిన సబ్‌ రీజినల్‌ ఆఫీస్‌ను అక్కడ ఏర్పాటు చేసి, రీజినల్‌ ఆఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బీబీనగర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయండి..
యాదాద్రి భువనగిరిలో 550 పరిశ్రమల్లో సుమారు 22 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడానికి చౌటుప్పల్‌ లేదా బీబీనగర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రితో ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వినతి పత్రాన్ని సమర్పించారు.

మరిన్ని వార్తలు