అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించండి

26 Apr, 2019 15:49 IST|Sakshi

ఢిల్లీ: ఏపీలో చోటుచేసుకుంటున్న ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యహరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ధర్మాసనం సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు పలు అంశాలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఎన్‌జీటీ శుక్రవారం సమావేశం అయింది. ఈ సందర్భంగా ఎన్‌జీటీ, ఏపీ సీఎస్‌కు సమావేశంలో పలు సూచనలు చేసింది.  అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిపై భారీ జరిమానాలు విధించాలని, వాటిని చూసి మరెవరు అక్రమ తవ్వకాలు పాల్పడకుండా ఉండాలని చెప్పింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని, కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన చేసింది.

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని నేరుగా సీఎస్‌ పర్యవేక్షించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. ఆరు నెలల్లో మరోసారి సమావేశమవుదామని, ఆ తర్వాత స్టేటస్‌ రిపోర్ట్‌ అందజేయాలని సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి స్టేటస్‌ రిపోర్టు కూడా ఎన్‌జీటీ తీసుకుంది. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇసుక తవ్వకాలు, మైనింగ్‌, జల, గాలి కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు