భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి 

20 Jun, 2019 15:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని మరాఠ్వాడలో జూన్‌ ఐదవ తేదీన జల్లులు కురియడంతో తొలకరి జల్లులంటూ స్థానిక పత్రికలన్నీ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో వార్తను రాశాయి. 2017, ఆగస్టు 17వ తేదీ తర్వాత వర్షపు జల్లులు చూడడం వారు ఇదే మొదటి సారి. 2016 సంవత్సరం తర్వాత ఎప్పుడు భారీ వర్షాలు కురిశాయో మాత్రం అక్కడి ప్రజలకు గుర్తు కూడా లేదు. ఈసారి వర్షాలు పడకపోతే పంటను వదులుకోవాలని రైతులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడి కూడా బాగా పడిపోయింది. 

2018 చలికాలపు ఆహార ధాన్యాల దిగుబడి గతేడాదితో పోలిస్తే 63 శాతం పడిపోయింది. చిరుధాన్యాలు 68 శాతం, పప్పులు 51 శాతం, నూనె గింజలు 70 శాతం, గోధుమ 61 శాతం, మొక్కజొన్నలు 75 శాతం, నువ్వుల దిగుబడి 92 శాతం పడిపోయాయి. ఈసారి దిగుబడుల గురించి ప్రశ్నించగా, పంటలు వేసే పరిస్థితులేవంటుంటే ఇంక దిగుబడులు ఎలా ఉంటాయని మెట్టసాగు వ్యవసాయంలో ఆరితేరిన కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి విజయ్‌ అన్నా బరేడ్‌ వ్యాఖ్యానించారు. ఒక్క మరాఠ్వాడలోనే కాకుండా, విదర్భ, తెలంగాణలో కూడా ఈ సారి మెట్టసాగుపై రైతులు ఆశలు వదులుకున్నారు. గతంలో రుతుపవనాల కాలంలో వర్షపాతం 80 నుంచి 90 శాతం వర్షం కురిసేదని, వాతావరణ మార్పుల కారణాల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయని స్థానిక శాస్త్రవేత్తలు తెలిపారు. 

మరిన్ని వార్తలు