27 ఏళ్లుగా 144 సెక్షన్

11 Sep, 2016 03:52 IST|Sakshi
27 ఏళ్లుగా 144 సెక్షన్

- రాజస్తాన్‌లోని కోటాలో 1989 నుంచి ఆంక్షలు
 -కోర్టులు చెప్పినా.. మారని పరిస్థితి
     

వారం రోజులు 144 సెక్షన్ ఉంటేనే అమ్మో అంటాం. కానీ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 27 ఏళ్లుగా.. 144 సెక్షన్ నీడలో జీవితం గడుపుతున్నారు రాజస్తాన్‌లోని కోటా వాసులు. ప్రముఖ విద్యాకేంద్రమైన కోటాలో.. 144 సెక్షన్ వల్ల ఓ పండగలేదు, ఊరేగింపు లేదు. పెళ్లికి, చావుకు తప్ప మిగిలిన సమయాల్లో నలుగురికి మించి కనబడితే.. పోలీసులు ఉతికేస్తారు. కోటాలోని బజాజ్ ఖానా, ఘంటాగఢ్, మక్బారా పఠాన్, తిప్తా ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. రెండు కిలోమీటర్ల పొడవుండే ఈ ప్రాంతాల్లో మైనారిటీలు ఎక్కువగానివసిస్తున్నారు.
 
ఐఐటీ విద్యాకేంద్రం కోటా.. దేశవ్యాప్తంగా కోటాకు మంచి పేరుంది. ఐఐటీ పోటీ పరీక్షలకోసం ఇక్కడున్న కోచింగ్ సెంటర్లలో చేరేందుకు దేశం నలుమూలలనుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు వస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికే మెజారిటీ ర్యాంకులొస్తాయని నిరూపితమైంది. కానీ.. ఇదే కోటాలోని ఓ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా 144 సెక్షన్ అమల్లో ఉండటం ఆశ్చర్యకరమే. అప్పటినుంచీ..1989లో ఒకసారి కోటాలో మత ఘర్షణలు రేగాయి. కొన్ని రోజులకే కోటాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి కుదురుకున్నా.. ఈ ప్రాంతాల్లో మాత్రం చాలా ఉద్రిక్తంగానే ఉంది. దీంతో 144 సెక్షన్ పొడిగించారు. ఆ తర్వాత ఎప్పుడేమవుతుందోనని పొడిగిస్తూనే ఉన్నారు. అయితే.. నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, అంతా ప్రశాంతంగానే ఉన్నా తమను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు అంటున్నారు.


కోర్టుకెళ్లినా.. 20 ఏళ్ల తర్వాత 2009లో స్థానికులంతా కోర్టుకెళ్లారు. 144ను ఎత్తేయాలని విన్నవించారు. కోర్టుకు ప్రభుత్వం సానుకూలంగా సమాధానమిచ్చి కర్ఫ్యూ ఎత్తేస్తామని చెప్పినా.. ఇంతవరకు అది అమలు చేయలేదు. దీనిపై అధికార వర్గాలు కూడా ఈ ప్రాంతం చాలా సున్నితమైందని, ఎప్పుడైనా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడొచ్చని.. అందుకే 144 సెక్షన్ కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం, అధికారుల తీరును ఆర్టీఐ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రజల హక్కులను సర్కారు కాలరాస్తోందని విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆర్నెల్లకు మించి 144 సెక్షన్ అమలు చేయకూడదని కానీ.. ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి ప్రజల తలరాతలు మారటం లేదని న్యాయవాదులంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు