గౌతమ్‌ గంభీర్‌కు కోపం వచ్చింది

13 Apr, 2017 16:42 IST|Sakshi
గౌతమ్‌ గంభీర్‌కు కోపం వచ్చింది

టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌కు దేశభక్తి చాలా ఎక్కువ. పాకిస్తాన్‌ అంటే చాలు మనోడికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. తాజాగా కశ్మీర్‌లో భారతీయ బలగాల మీద కొందరు దాడులు చేయడంతో గంభీర్‌ బాగా ఆవేశానికి గురయ్యాడు. భారతీయ సైనికుడి మీద ఒక్క దెబ్బ పడితే.. కనీసం వంద మంది జీహాదీల ప్రాణాలు తీయాలని అన్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలనే వాళ్లకు కూడా గట్టిగా బుద్ధి చెప్పాడు. మన జాతీయ పతాకంలో మూడు రంగులకు మంచి అర్థం ఉందని, అందులో కాషాయ రంగు ఆగ్రహంతో కూడిన మంట అయితే, తెలుపురంగు జీహాదీల శవం మీద కప్పే వస్త్రమని, ఆకుపచ్చ రంగు ఉగ్రవాదాన్ని ద్వేషించడమని తనదైన శైలిలో భాష్యం చెప్పాడు. ఈ మేరకు గురువారం నాడు వరుసపెట్టి ట్వీట్లు చేశాడు.

భారతీయ జవాన్లను కశ్మీర్‌లో కొంతమంది జనాలు తిడుతూ కొడుతున్నట్లుగా వచ్చిన ఒక వీడియో చూసిన తర్వాత గంభీర్‌ ఈ విధంగా స్పందించాడు. తమకు స్వాతంత్ర్యం కావాలనుకునే వాళ్లు తక్షణం భారతదేశం వదిలి వెళ్లిపోవాలని స్పష్టం చేశాడు. ఇంతకుముందు కూడా గుర్మెహర్‌ కౌర్‌ అనే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని శాంతి సందేశాలు పోస్ట్‌ చేసినందుకు ఆమెను వెక్కిరించడమే కాక, అత్యాచారం చేస్తామని కూడా బెదిరించారు. ఆమెకు గంభీర్‌ మద్దతుగా నిలిచాడు. భారత సైన్యం అంటే తనకు చాలా గౌరవం ఉందని, వాళ్లు దేశానికి చేసే సేవతో పోలిస్తే మనం చేసేది ఏమీ కాదని అన్నాడు. భారతీయులంతా తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎలా స్వాతంత్ర్యం ఉందో, గుర్మెహర్‌కు కూడా అలాగే ఉందని, ఆమె అభిప్రాయాలతో ఏకీభవించచ్చు, లేకపోవచ్చు గానీ ఆమెను గేలిచేయడం మాత్రం సరికాదని అప్పట్లో చెప్పాడు.

 

మరిన్ని వార్తలు