సీఎం ఆదిత్యనాథ్‌ కోసం 20 కూలర్లు

6 Jun, 2017 15:38 IST|Sakshi
సీఎం ఆదిత్యనాథ్‌ కోసం 20 కూలర్లు

అలహాబాద్‌: ‘నాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకండి. అందరిలాగే నన్ను పరిగణించండి’ అంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు ఆదేశాలిచ్చి కనీసం 24గంటలు కూడా పూర్తి కాకుండానే తిరిగి అదే పద్ధతిని కొనసాగించారు. ఆయన వస్తున్నారని తెలిసి ఓ ఆస్పత్రిలోకి పెద్ద మొత్తంలో కూలర్లు తెప్పించారు. తిరిగి ఆయన వెళ్లిపోగానే రిక్షాలపై వేసుకొని వెళ్లిపోయారు. అలహాబాద్‌లోని స్వరూప్‌ రాణి నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం సీఎం ఆదిత్యనాథ్‌ వెళ్లారు.

ఎముకల వ్యాధుల డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయొద్దని సీఎం చెప్పినా వినకుండా 20 కూలర్లు అద్దెకు తీసుకొచ్చిన అధికారులు తిరిగి వాటిని కార్యక్రమం ముగిశాక పంపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలవ్వగా.. తమ ఆస్పత్రిలో 70 నుంచి 80 కూలర్లు ఉన్నాయని, అందులో కొన్ని పనిచేయకపోవడంతో వాటిని తెప్పించామని అటు వైద్యాధికారులు, అక్కడి ప్రభుత్వాధికారులు సమర్థించుకున్నారు. అయితే, సీఎం వెళ్లిన తర్వాత కూడా ఉంచితే బాగుంటుంది కదా అని రోగులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు