లాక్‌డౌన్ బేఖాత‌రు: విదేశీయులకు శిక్ష‌

12 Apr, 2020 11:57 IST|Sakshi
పేప‌ర్‌పై సారీ అని రాస్తున్న విదేశీయులు (ఫొటో కర్ట‌సీ: ‌హిందుస్తాన్ టైమ్స్‌)

డెహ్రాడూన్: మ‌నిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ద‌య‌చేసి ఇంట్లోనే ఉండండి.. సామూహికంగా తిర‌గ‌కండి అని చిల‌క‌కు చెప్పిన‌ట్లు చెప్పినా ఎవ‌రూ చెవికెక్కించుకోవ‌ట్లేదు.  దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించ‌క త‌ప్పలేదు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో పెద్ద‌గా మార్పు లేదు. తాజాగా విహారానికి అంటూ మూకుమ్మ‌డిగా తిరుగుతున్న‌ విదేశీయుల‌కు రిషికేశ్ పోలీసులు త‌గిన గుణ‌పాఠం నేర్పారు. వివ‌రాల్లోకి వెళితే... శ‌నివారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ప‌దిమంది విదేశీయులు లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను బేఖాత‌రు చేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. (కరోనా ఎఫెక్ట్‌: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ)

క‌నీసం సామాజిక ఎడ‌బాటును కూడా ప‌ట్టించుకోకుండా గంగా న‌దిలో విహ‌రిస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వారికి అరుదైన‌‌ శిక్ష విధించారు. "నేను లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాను, అందుకు క్ష‌మించండి" అని వారితో 500 సార్లు రాయించారు. దీనికోసం పెన్నూ పేప‌ర్ కూడా చేతికందించారు. మొద‌టిసారి కాబ‌ట్టి ఇలాంటి చిన్న శిక్ష‌తో వ‌దిలేస్తున్నామ‌ని, మ‌రోసారి ఇలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. కాగా విదేశీయులంతా ఇజ్రాయెల్‌, మెక్సికో, ఆస్ట్రేలియా, ఇత‌ర యూరోపియ‌న్ దేశాలకు చెందిన‌వారని పోలీసులు పేర్కొన్నారు. (కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్‌ అగ్రస్థానం)

మరిన్ని వార్తలు