ఒకే తుపాకీతో గౌరీ, కల్బుర్గి హత్య

9 Jun, 2018 02:25 IST|Sakshi

తేల్చి చెప్పిన ఫోరెన్సిక్‌ నివేదిక  

బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌ను, హేతువాది ఎంఎం కల్బుర్గిని ఒకే తుపాకీతో కాల్చి చంపినట్టు తేలింది. కర్ణాటక రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీ గౌరీ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)కు నివేదిక అందజేసింది. కల్బుర్గి 2015 ఆగస్టు 30న ధార్వాడ్‌లోని తన ఇంట్లోనే హత్య చేశారు. గౌరి కిందటేడాది సెప్టెంబర్‌ 5న తన నివాసానికి సమీపంలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తేడాతో వీరిద్దరినీ ఒకే తుపాకీతో చంపారని సిట్‌ గతంలో చెప్పినా ఫోరెన్సిక్‌ నివేదిక సాక్షిగా ఆ విషయం ఇప్పుడు  స్పష్టంగా బయటపడింది.

7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతో వీరిని చంపినట్టు నివేదిక పేర్కొంది. గౌరీ లంకేశ్‌ కేసుకు సంబంధించి సిట్‌ ఇప్పటికే బెంగళూరులోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు తొలి చార్జిషీట్‌ సమర్పించింది. అందులో హిందుత్వ కార్యకర్త నవీన్‌ కుమార్‌ను నిందితుడిగా సిట్‌ పేర్కొంది. అందులో ‘గౌరీ లంకేశ్‌ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ తనతో చెప్పాడని నిందితుడు నవీన్‌ పేర్కొన్నట్లు పొందు పరిచారు. లంకేశ్‌ను హత్య చేసేందుకు బుల్లెట్లు సిద్ధం చేయమని ప్రవీణ్‌ అడిగాడని నవీన్‌ చెప్పినట్టు పేర్కొన్నారు.

మరో హత్యకు కుట్ర
హేతువాది, హిందుత్వ సిద్ధాంత విమర్శకుడు కేఎస్‌ భగవాన్‌ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నవీన్‌ సిట్‌ వద్ద అంగీకరించాడు. కిందటేడాది నవంబర్‌లో సంజయ్‌ బన్సారే అను వ్యక్తి తనను కలసి కేఎస్‌ భగవాన్‌ను చంపేందుకు తుపాకీలను సిద్ధం చేయమని అడిగాడని సిట్‌తో చెప్పాడు. తనకు శ్రీరామ్‌ సేనే, బజరంగ్‌దళ్‌తో సంబంధాలున్నా యని, 2014లో హిందూ యువసేనే అనే సంస్థను స్థాపించానని నవీన్‌ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు