ఎన్నికల సంస్కర్త ఇకలేరు

11 Nov, 2019 03:57 IST|Sakshi

గుండెపోటుతో టీఎన్‌ శేషన్‌ మృతి

ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం

సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ముఖచిత్రంపై తనదైన ముద్రవేసి, కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) తిరునెల్లయ్‌ నారాయణ అయ్యర్‌ శేషన్‌ (86) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన ఆదివారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌ 1990–96 సంవత్సరాల్లో 10వ సీఈసీగా పనిచేశారు. కేరళలోని పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో 1932లో జన్మించారు.

మెట్రోమ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ. శ్రీధరన్‌ టీఎన్‌ శేషన్‌ ఇంటర్మీడియట్‌ వరకు కలిసి చదువుకున్నారు. వీరిద్దరికీ ఏపీలోని కాకినాడ జేఎన్‌టీయూలో సీట్లు వచ్చినా శేషన్‌ మాత్రం మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదువుకునేందుకు మొగ్గు చూపారు. శ్రీధరన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, అక్కడే డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్లపాటు పనిచేసి, ఆ సమయంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం హార్వర్డ్‌ వర్సిటీలో 1968లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు.

తమిళనాడుతోపాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సీఈసీకి ముందు ఆయన అత్యంత కీలకమైన కేబినెట్‌ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా కూడా ఉన్నారు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవెగౌడ మారారు. శేషన్‌ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా చాలా క్లుప్తంగా మాట్లాడేవారని పేరు. 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్‌పై ఆయన పోటీ చేశారు.

ఎన్నికల విధానంలో పారదర్శకత సాధించేందుకు చేసిన కృషికిగాను ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్‌ మెగసేసే అవార్డును ఆయన అందుకున్నారు. 1959లో ఆయనకు జయలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. శేషన్‌ మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ ఆయన్ను లెజెండ్‌ అని శ్లాఘించారు.

నిజాయితీకి నిలువుటద్దం: వైఎస్‌ జగన్‌
అమరావతి: శేషన్‌ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావం, నిజాయితీ, నిర్భీతికి శేషన్‌ నిలువుటద్దమని కొనియాడారు. పబ్లిక్‌ సర్వెంట్‌గా శేషన్‌ సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఉన్న శక్తిని ప్రజాస్వామ్య సౌధ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో నిరూపించారని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శేషన్‌ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

ఎన్నికల్లో శేషన్‌ సంస్కరణలు
డబ్బు, అధికారం ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చిన రోజుల్లో ఆయన సీఈసీ పగ్గాలు చేపట్టారు. అనేక విప్లవాత్మక చర్యలతో ఎన్నికలు నిర్వహించి ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సంఘానికి గౌరవం తెచ్చిపెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరనేటంత కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేశారు. ఆయన చర్యల కారణంగా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా కొంత ఇబ్బందులకు గురయింది. ఈ రెండు వర్గాలు కలిసి ఆయన్ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలతో అప్పట్లో కొందరు ఎన్నికల కమిషన్‌ను అల్‌–శేషన్‌(ఆల్సేషియన్‌) అనే వారని అంటుంటారు.

ఎన్నికల్లో అరికట్టిన అక్రమాలు..
► ఓటర్లకు లంచాలివ్వడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ
► ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని    వాడుకోవడం
► కులం, మతం ప్రాతిపదికన ఓట్లు కోరడం
► ప్రచారానికి ప్రార్థనా స్థలాలను వాడుకోవడం
► అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడటం

మరిన్ని వార్తలు