రాజ్యసభకు మాజీ సీజేఐ

17 Mar, 2020 06:22 IST|Sakshi

నామినేట్‌ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేటీఎస్‌ తులసి రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్‌ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. గత ఏడాది నవంబర్‌ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.

అదే నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు.

రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్‌ గొగొయే నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని సంచలన తీర్పునిచ్చింది కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే. ఎన్నార్సీ ప్రక్రియను సమీక్షించిన బెంచ్‌కు కూడా జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వం వహించారు. రాజ్యసభకు నామినేట్‌ అవుతున్న తొలి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మాజీ సీజేఐ రంగనాథ్‌ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్‌ సభ్యుడు కాదు. కాంగ్రెస్‌ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.   
 

మరిన్ని వార్తలు