ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి

18 Jan, 2019 03:03 IST|Sakshi
శ్రీధర్‌ ఆచార్యులు

రాష్ట్రపతికి శ్రీధర్‌ ఆచార్యులు లేఖ  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి.

సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్‌ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్‌ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్‌ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్‌ వార్షిక సమావేశంలో కోవింద్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు.

ఆలోక్‌ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్‌ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ సిక్రీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్‌ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు