‘జెంటిల్మన్‌’ ఇకలేరు

14 Aug, 2018 01:25 IST|Sakshi
కోల్‌కతాలో సోమ్‌నాథ్‌ పార్థివదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

సోమ్‌నాథ్‌ ఛటర్జీ కన్నుమూత

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

కోల్‌కతా/న్యూఢిల్లీ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ (89) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన సోమ్‌నాథ్‌ సోమవారం మృతిచెందారు.అంతకుముందు 40 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కాస్త కోలుకోవడంతో డిశ్చార్జి అయిన మూడ్రోజుల్లోనే కన్నుమూశారు. ‘జెంటిల్మన్‌ కమ్యూనిస్టు’గా ప్రత్యర్థుల ప్రశంసలు అందుకున్న సోమ్‌నాథ్‌  పదిసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. కీలక అవయవాల వైఫల్యం కారణంగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈయనకు భార్య రేణు, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఓ సమర్థుడైన నాయకుడిగా, స్పీకర్‌గా అంతకుముందు లాయర్‌గా ఛటర్జీ తనదైన ముద్రవేసుకున్నారు.

కోలుకుంటున్నారని అనుకున్నంతలోనే..
ఛటర్జీ పార్థివదేహాన్ని మొదట పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సందర్శన అనంతరం గన్‌ సెల్యూట్‌తో నివాళులర్పించారు. అక్కడినుంచి కలకత్తా హైకోర్టుకు తీసుకెళ్లారు. ఇక్కడ ఈయన భౌతికకాయానికి జడ్జీలు, లాయర్లు నివాళులర్పించారు. అయితే దీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీకి సేవలందించిన ఛటర్జీ.. తన శరీరాన్ని అంత్యక్రియలు చేయకుండా మెడికల్‌ కాలేజీకి ప్రయోగాలకు ఇవ్వాలని గతంలో చెప్పారు. దీంతో పార్థివదేహాన్ని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎన్‌ ఆసుపత్రికి ఇచ్చారు.

రాజకీయ కీర్తి శిఖరం
‘భారత రాజకీయాల్లో సోమ్‌నాథ్‌ ఓ కీర్తి శిఖరమ’ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అందరు పార్లమెంటేరియన్ల గౌరవాన్ని పొందిన మహనీయుడని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ అన్నారు. భిన్నమైన సిద్ధాంతాలకు చెందినవారమైనా.. ఎంతో ప్రేమగా వ్యవహరించేవారని ఆయనతో కలిసి పనిచేసిన రోజులను స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ గుర్తుచేసుకున్నారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ‘సోమ్‌నాథ్‌ దా ఇకలేరు. ఆయన మృతి మాకు తీరని లోటు’ అని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నేతలు విచారం వ్యక్తం చేశారు.

గొప్ప పార్లమెంటేరియన్‌: కేసీఆర్‌: చట్టసభలు ఉన్నత ప్రమాణాలతో నడిచేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని, గొప్ప పార్లమెంటేరియన్‌గా చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ కోసం ఎంపీలుగా రాజీనామా చేసినప్పుడు స్పీకర్‌గా ఆయనే ఉన్నారని గుర్తు చేశారు.

విలువలకు కట్టుబడిన వ్యక్తి: జగన్‌
సోమనాథ్‌ మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత,  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. గొప్ప మార్క్సిస్టు రాజకీయ వేత్త అయిన ఛటర్జీ విలువలకు కట్టుబడి వ్యవహరించారని జగన్‌ నివాళులర్పించారు. సోమనాథ్‌∙మరణంతో విలువలకు, నీతి నియమాలకు కట్టుబడి వ్యవహరించిన ఒక గొప్ప నేతను దేశం కోల్పోయిందని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తలు