తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ

2 Jun, 2020 08:12 IST|Sakshi

కూతురు తాకట్టు..తల్లి మృతి

కడచూపు నోచుకోని కన్నబిడ్డ

బాలికను విడిపించిన మాజీ ఎంపీ

అంతేలే పేదల బతుకులు..అశ్రువులే నిండిన కుండలు.. కూలాడితే గాని కుండాడని జీవితాలు.. పిల్లల్ని చదివించాలంటే అప్పులు చేయాలి.. అప్పులు తీరాలంటే అవకాశాలు వెతుక్కోవాలి. ఉన్న ఊరిలో పరిస్థితులు వెక్కిరిస్తే పొరుగూరికి వలస పోవాలి. అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కష్టించి పని చేయాలి. ఆ క్రమంలో అనారోగ్యం బారిన పడితే ఇక అంతే సంగతులు. చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సంకట స్థితినే నవరంగపూర్‌ జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు చవిచూశారు. 

ఒడిశా: గ్రామంలో చేసిన అప్పులు తీర్చేందుకు కుమార్తెతో కలిసి కూలి పనుల కోసం హైదరాబాద్‌ వలస వెళ్లిన తల్లి అక్కడ జబ్బు పడింది. హాస్పిటల్‌ ఖర్చుల కోసం, మందులకు తాము పనిచేసే యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇంటికి వెళ్లి వచ్చి అప్పు తీరుస్తానని చెప్పి కుమార్తెను యజమాని వద్ద తాకట్టు పెట్టి గ్రామానికి వచ్చింది. జబ్బు విషమించడంతో దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఈ విషయం తెలిసినప్పటికీ కన్నతల్లిని  కడసారి చూసేందుకు ఆ బాలిక ఇంటికి రాలేకపోయింది. చివరికి విషయం తెలిసిన నవరంగపూర్‌ మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి వెంటనే వారి గ్రామానికి వెళ్లి పూర్తి విషయాలు సేకరించి తన మనిషిని హైదరాబాద్‌ పంపి ఆ బాలికను విడిపించి తీసుకువచ్చిన సంఘటన జిల్లా ప్రజల హృదయాలను కదిలించింది.

వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్‌ జిల్లా చందాహండి సమితికి చెందిన అనాది పాణిగ్రహి భర్త మూడేళ్ల కిందట మరణించాడు. ఆమె తన ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాలన్న ఆశతో మైక్రోఫైనాన్స్‌ కంపెనీ వద్ద రూ.30 వేలు రుణం తీసుకుంది. ఇద్దరినీ కళాశాలలో చేర్చింది. అయితే తీసుకున్న అప్పు తీరే మార్గం కానరాక పెద్ద కుమార్తె ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించి తనతో పాటు చిన్న కుమార్తె సాగరిక (16)ను తీసుకుని 5 నెలల కిందట ఉపాధి కోసం  హైదరాబాద్‌ వలస వెళ్లింది. అక్కడ తల్లీకూతుళ్లు ఒక ఇటుకల కంపెనీలో పనికి కుదిరారు.

అయితే హైదరాబాద్‌లో తల్లి అనాది ఆరోగ్యం క్షీణించింది. మందుల కోసం కంపెనీ యజమాని వద్ద  కొంత డబ్బు అప్పుగా తీసుకుని కుమార్తె సాగరికను ఇటుకల కంపెనీ యజమాని వద్ద తాకట్టు పెట్టి చందాహండి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన కొంత కాలానికే  ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో  మరణించింది. అయితే అప్పటికే లాక్‌డౌన్‌  అమలులో ఉండడం వల్ల కుమార్తె సాగరిక తల్లిని చూసేందుకు కూడా ఇంటికి రాలేకపోయింది. గ్రామంలో ఉన్న సాగరిక అక్క ప్రియాంక  చెల్లెలి రాక కోసం ఎదురు చూస్తూ విలపిస్తోంది. చదవండి: ప్రియుడు మోసం చేశాడని టీవీ నటి ఆత్మహత్య

స్పందించని ప్రభుత్వం 
హైదరాబాద్‌లో తాకట్టులో ఉన్న సాగరిక తన గోడును ఒడిశా ప్రభుత్వానికి విన్నవించుకుంది. అయితే ఎవరూ స్పందించలేదు. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసిన నవరంగపూర్‌ మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి స్పందించి వెంటనే తన కారులో చందాహండి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన చందాహండి సమితి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేశ్వర హింసను వెంటనే హైదరాబాద్‌ పంపారు. ఆయన ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల అధికారులతో పాటు ఇటుకల కంపెనీ యజమానితో మాట్లాడి సాగరికను వెంటనే విడిచి పెట్టాలనికోరారు. ఎట్టకేలకు సాగరిక విముక్తి పొంది శనివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం నవరంగపూర్‌ చేరుకుంది. 

లాక్‌డౌన్‌ వల్ల పంపలేక పోయాం
కాంగ్రెస్‌ నేతలు ఆమెను ఓదార్చి ఈ విషయం విలేకరులకు తెలియ జేశారు. సాగరిక తన  బాధల గాథలను చెబుతూ విలపించింది. అక్కను కలిసి భోరున ఏడ్చింది. హైదరాబాద్‌లో ఇటుకల బట్టీ యజమాని కె.సుబ్బారావు ఫోన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సాగరిక తల్లి అనారోగ్యం వల్ల ఇంటికి  వెళ్లిందని, ఆమె మరణించిన విషయం తెలిసి సాగరికను పంపించాలని భావించామని లాక్‌డౌన్‌ కారణంగా పంపించలేక పోయానని చెప్పారు. తల్లిని కోల్పోయి  అనాథల్లా మిగిలిన అక్కాచెలెళ్లు ప్రియాంక, సాగరికలను  ప్రభుత్వం ఆదుకుని వారిని చదివించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.  

నవరంగపూర్‌ చేరుకుని భోరున విలపిస్తున్న సాగరిక

మరిన్ని వార్తలు