ఎయిమ్స్‌లో అటల్‌జీ

12 Jun, 2018 01:25 IST|Sakshi

కిడ్నీ, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌

డయాలిసిస్‌ చేశాం.. ఆరోగ్యం నిలకడగానే ఉంది: వైద్యులు

పరామర్శించిన మోదీ, అడ్వాణీ, రాహుల్‌

ఆరోగ్యం క్షీణించడంతో 2004 నుంచి ప్రజాజీవితానికి దూరం

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, 93ఏళ్ల అటల్‌ బిహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయిని వైద్యుల సలహాతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌(ఆలిండియా ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లోని అత్యవసర చికిత్సావిభాగం(ఐసీయూ)లో చేర్పించారు.

సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నా.. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో తీసుకురాగానే డయాలసిస్‌ చేసిన వైద్యులు తర్వాత ఇన్‌ఫెక్షన్‌కు చికిత్సనందిస్తున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం వాజ్‌పేయి ఆరోగ్య బాధ్యతలను చూస్తోంది. ‘ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తోంది’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు.  

పరామర్శించిన ప్రముఖులు
1984 నుంచి వాజ్‌పేయి ఒకే కిడ్నీతో పనిచేస్తుండగా ఇప్పుడు ఆ కిడ్నీకి కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకడంతోనే డయాలిసిస్‌ చేస్తున్నారు. గులేరియా మూడుదశాబ్దాల పాటు వాజ్‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడూ ఆయన నేతృత్వంలోనే వైద్యులు చికిత్సచేస్తున్నారు. ఆసుపత్రిలో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్షవర్ధన్, పలువురు బీజేపీ ప్రముఖులు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తదితరులు పరామర్శించారు.

‘మా అందరికీ స్ఫూర్తిప్రదాత అయిన వాజ్‌పేయీజీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. దాదాపు 50 నిమిషాల సేపు ఆసుపత్రిలో ఉన్న ప్రధాని మోదీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెల్సుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మోదీ మాట్లాడారు. అడ్వాణీ రాత్రి 9 గంటలకు తన దీర్ఘకాల సహచరుడిని చూసేందుకు ఎయిమ్స్‌ వచ్చారు. ఈ సందర్భంగా అడ్వాణీ కాస్త ఉద్విగ్నతకు లోనైనట్లు సమాచారం.

నేడో రేపో డిశ్చార్జ్‌?
‘వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఉన్నతస్థాయి వైద్యబృందం ఆయనకు చికిత్సనందిస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు. మంగళవారం ఉదయం వాజ్‌పేయిని డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ వెల్లడించారు. పరామర్శించేందుకు ప్రముఖులు వస్తుండటంతో ఎయిమ్స్‌తోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో భద్రత పెంచారు.

వాజ్‌పేయి ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998–2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి.. 2009 తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అప్పటినుంచీ ఆయన ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.  ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగా  వాజ్‌పేయి రికార్డు సృష్టించారు.  



                         ఎయిమ్స్‌లో మోదీకి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న వాజ్‌పేయి బంధువు

మరిన్ని వార్తలు