కీలక పదవిని చేపట్టనున్న ఉర్జిత్ పటేల్

20 Jun, 2020 13:01 IST|Sakshi
ఉర్జిత్ పటేల్ (ఫైల్ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ దేశ ప్రధాన ఆర్థిక థింక్ ట్యాంక్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ)కి చైర్మన్‌గా నియమితు లయ్యారు. నాలుగేళ్ల పాటు బాధ్యతలను నిర్వహిస్తారని ఎన్‌ఐపీఎఫ్‌పీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన దాదాపు 18 నెలల తరువాత మరో ఆర్థిక సంస్థ కీలక బాధ్యతలను చేపట్టడం విశేషం.

దాదాపు ఆరేళ్లపాటు ఎన్‌ఐపీఎఫ్‌పీకి అధ్యక్షత వహించిన విజయ్ లక్ష్మణ్ కేల్కర్ స్థానంలో జూన్ 22, 2020 నుంచి ఉర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించనున్నారు.  ఈ సందర్భంగా  డాక్టర్ విజయ్ కేల్కర్ చేసిన విశేష కృషికి ఎన్‌ఐపీఎఫ్‌పీ ప్రశంసలు కురిపించింది. ఆయన సేవలను కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కాగా ఆర్‌బీఐ గవర్నర్ గా పదవీకాలం ముగియకముందే డిసెంబర్ 10, 2018న ఉర్జిత్ పదవికి రాజీనామా చేశారు.  తన మూడేళ్ల పదవీకాలం 2019 సెప్టెంబర్‌లో ముగిసేలోపే వ్యక్తిగత కారణాల పేరుతో పదవి నుంచి ఆయన వైదొలగిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు